తిమ్మాపూర్ రూరల్, జూన్ 13: మండలంలోని మన్నెంపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల పున:ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేకాధికారి జయశంకర్, ఎంపీడీవో రవీందర్‌రెడ్డి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికి ఉత్సాహపరిచారు. బాగా చదువుకోవాలని, ప్రభుత్వ పాఠశాలల్లోని వసతులు, ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పదో తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ మేడి అంజయ్య, ఉప సర్పంచ్ పీ అనిల్‌గౌడ్, జేఈ హరీశ్, స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్, హెచ్ఎంలు మారుతి, రవీందర్, ఎస్ఎంసీ చైర్పర్సన్ అంజలి, భాస్కర్, సిబ్బంది ఉన్నారు.
శంకరపట్నంలో..
వేసవి సెలవుల అనంతరం మండలంలోని అన్ని పాఠశాలలు తెరుచుకున్నాయి. ఎరడపల్లి గ్రామంలో ప్రత్యేకాధికారి ఈసరి జనార్దన్ ఆధ్వర్యంలో ఉన్నత, ప్రాథమిక పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు పూలతో స్వాగతం పలికారు. అనంతరం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేయించారు. రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలను తొలగించారు. సెగ్రిగేషన్ షెడ్డులో కంపోస్ట్ తయారీని పరిశీలించారు. ఇతర గ్రామాల్లో కూడా పారిశుధ్య పనులు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీవో బీషీర్, హెచ్ఎంలు, ప్రత్యేకాధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్థాయి అధికారులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
చిగురుమామిడిలో..
మండలంలో పాఠశాలలు పునః ప్రారంభం కాగా, మొదటి రోజు 30 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు ఎంఈవో విజయలక్ష్మి తెలిపారు. నూతన ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సర్పంచులు, ఎంపీటీసీలు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. బొమ్మనపల్లిలో సర్పంచ్ కానుగంటి భూమిరెడ్డి, ఎంపీటీసీ మల్లేశం, ఉప సర్పంచ్, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు నూతన విద్యార్థులకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.