కరీంనగర్, జూన్ 12 నమస్తే తెలంగాణ (కరీంనగర్ ప్రతినిధి) / కమాన్‌చౌరస్తా: ఐటీ కంపెనీల తీరు మారుతున్నది. ప్రతిభావంతులు ఎక్కడ ఉంటే అక్కడ జల్లెడ పట్టి మరీ కొలువులు కట్టబెడుతున్నాయి. వారికి అనుగుణంగా అభ్యర్థులను మార్చుకుంటున్నాయి. ఇందుకోసం డిగ్రీ కళాశాలలను వేదికలుగా మార్చుకుంటున్నాయి. ఇన్నాళ్లూ ఇంజినీరింగ్ కళాశాలలకే పరిమితమైన ఐటీ కంపెనీలు.. ఇప్పుడు వాటి దిశ, దశను మార్చుకొని డిగ్రీ కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు చేపడుతున్నాయి.. అర్హత ఉన్న అభ్యర్థులకు మంచి ప్యాకేజీతో కొలువులు ఇస్తున్నాయి.
రూటు మార్చిన ఐటీ కంపెనీలు
నిజానికి గత చరిత్ర చూస్తే.. ఇంజినీరింగ్ పూర్తిచేసిన వారికి మాత్రమే ఐటీ కంపెనీలు కొలువులు కట్టబెడుతూ వచ్చేవి. ఐటీ ఉద్యోగం చేయాలంటే.. ఏదో ఒక ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేసి ఉంటే తప్ప కొలువులు వచ్చేవి కావు. కానీ, ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులు, పరిస్థితుల నేపథ్యంలో ఐటీ కంపెనీలు తమ దృక్ఫథాన్ని మార్చుకుంటున్నాయి. గతంలో మాదిరిగా ఇంజినీరింగ్ కళాశాలకే పరిమితం కాకుండా కొద్దిరోజులుగా డిగ్రీకళాశాలలపై దృష్టిపెట్టాయి. కళాశాలల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్లు పెడుతూ, అక్కడే ఇంటర్వూలు నిర్వహించి వారికి కావాల్సిన ఏడాది ముందుగానే ఎంపిక చేసుకుంటున్నాయి. డిగ్రీ ఏదైనా సరే కంప్యూటర్ బేసిక్ అవగాహన ఉంటే చాలు.
దీంతో పాటుగా ప్రధానంగా కమ్యూనికేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్, కళాశాల చరిత్ర, సోషల్ మూమెంట్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నాయి. ప్రాంగణ నియామకాల్లో వారికి నచ్చిన అభ్యర్థులను సెలెక్టు చేసుకొని రూ.18 నుంచి 25వేల వరకు వేతనాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. ఆ తర్వాత సదరు కంపెనీలకు కావాల్సిన విధంగా అభ్యర్థులకు మూడు నెలల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అంతేకాదు రెగ్యులర్ డిగ్రీకి ఎటువంటి అంతరాయం లేకుండా ఉండేందుకు శని, ఆదివారాల్లోనే ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాయి. విప్రో లాంటి ఐటీ దిగ్గజ కంపెనీకి ఎంపికైన అభ్యర్థులను వారి పనికి అనుగుణంగా తీర్చిదిద్దేందుకు విల్ఫ్ (wilp) పేరుతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఇదే బాటలో మరికొన్ని కంపెనీలు నడుస్తున్నాయి. శిక్షణ పొందిన అభ్యర్థులకు ఇంటి నుంచే రాత్రి పూట పనిచేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయి.
శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో 104 ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలు కళాశాలున్నాయి. అందులో 16 ప్రభుత్వ, 88 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. వీటి పరిధిలో ఆయా కోర్సులకు సంబంధించి సుమారు 42వేల సీట్లు ఉన్నాయి. నాలుగువేల సీట్లు ప్రభుత్వ కాలేజీల్లో ఉండగా, మిగిలినవి ప్రైవేటులో ఉన్నాయి. మారుతున్న ప్రపంచీకరణకు అనుగుణంగా కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఏటా దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఆయా కళాశాలకు కేటాయిస్తున్నారు. మొత్తంగా 42వేల సీట్లున్నా ఏటా సుమారు 24 నుంచి 25 వేల మంది దాకా ప్రవేశం పొందుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. కాగా ఫైనల్ ఇయర్ వచ్చే సరికి మాత్రం 17 నుంచి 18వేల మంది మాత్రమే మిగులుతున్నారు.
భవిష్యత్ ఐటీ యుగమే..
మున్ముందు డిగ్రీ కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు మరిన్ని పెరిగే అవకాశం ఉందంటున్నారు ఐటీ నిపుణులు. రాష్ట్ర సర్కారు అమల్లోకి తీసుకొచ్చిన కొత్త విధానాలు, ఐటీ కంపెనీలకు కల్పిస్తున్న సౌకర్యాలు, చర్చలు, సంప్రదింపుల్లో అనుసరిస్తున్న వ్యూహం.. అందులోనూ హైదరాబాద్‌లో నెలకొన్న శాంతి భద్రతలు, పలు ప్రపంచ వేదికలపై ఐటీ కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై ఐటీ మంత్రి కేటీఆర్ ప్రజంటేషన్ ఇస్తుండడం వంటి అంశాలతో ప్రపంచ స్థాయి ఐటీ దిగ్గజాలు రాష్ర్టానికి వస్తున్నాయి. ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీలు.. మరింత విస్తరణ దిశగా దృష్టిపెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే ఈ రంగంలో కొలువు కొట్టేవారికి మంచి వేతనం ఉండడమే కాకుండా భవిష్యత్‌లో మరిన్ని అవకాశాలు పెరగనున్నాయి. ఫలితంగా భవిష్యత్ మొత్తం ఐటీ యుగంగా మారే పరిస్థితులున్నాయంటున్నారు విశ్లేషకులు.
కంపెనీలు భారీగా వస్తున్నాయి.
రెండేళ్లుగా డిగ్రీ కళాశాల్లో ప్రాంగణ నియామకాలు పెరిగాయి. చాలా ఐటీ కంపెనీలు నేరుగా వచ్చి.. ఇంటర్వూలు చేస్తున్నాయి. డిగ్రీ ఏదైనా.. కమ్యూనికేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్ వంటి అంశాలను ప్రధాన ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. ఎంపికైన అభ్యర్థుల్లో చాలా మంది కంప్యూటర్ పై బేసిక్ నాలెడ్జి కలిగిన వారే. సెలక్టయిన వారికి రెండు మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి నైపుణ్య వంతులుగా తీర్చిదిద్దుతున్నాయి. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి రాత్రి పూట ఇంటినుంచే పనిచేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాయి. తద్వారా రెగ్యులర్ డిగ్రీకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఐటీ కొలువు చేయాలనుకునే విద్యార్థులు.. కమ్యూనికేషన్ స్కిల్స్‌పై ఎక్కువగా దృష్టిపెడితే.. కొలువు సులువుతుందన్నది నా సూచన. ప్రస్తుతం జరుగుతున్న నియామకాల్లో వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు.
– రవీందర్‌రెడ్డి,అల్ఫోర్స్ డిగ్రీ కళాశాల కరెస్పాడెంట్
మంచి ప్యాకేజీతో ఎంపికయ్యా..
డిగ్రీ పూర్తయిన వెంటనే మంచి ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికయ్యా. డిగ్రీ సమయంలో ఉద్యోగ నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ, టాస్క్ ద్వారా నిర్వహించిన కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగ పడ్డాయి. వీటి ద్వారా ఉద్యోగం సాధించడం సంతోషంగా ఉంది. డిగ్రీతో ఐటీ ఉద్యోగం పొందడం గర్వంగా ఉంది.
– అమతుల్ జబ్బార్, బీఎస్సీ ఎంపీసీఎస్
ఒకేసారి రెండు జాబ్స్
డిగ్రీ చదువుతున్న సమయంలో కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్లో రెండు జాబ్స్ వచ్చాయి. నాకు చాలా హ్యాపీగా ఉన్నది. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఒక జాబ్ కొట్టడమే కష్టం. కానీ, డిగ్రీ చదువుతూ టెక్ మహేంద్ర లాంటి సంస్థలో జాబ్ రావడం నేను మరిచిపోలేను. నేనే కాదు నా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నది.
– కాపర్తి మాధురి, బీఎస్సీ ఎంసీసీఎస్
సద్వినియోగం చేసుకోవాలి
ప్రాంగణ నియామకంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగానికి ఎంపికయ్యా. ఒకప్పుడు ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులనే జాబ్స్‌కు ఎంపిక చేసేవారు. కానీ, ప్రస్తుతం డిగ్రీ కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తూ, ఉద్యోగాలకు ఎంపిక చేయడం గొప్ప విషయం. ప్రతిభ గల యువతకు ఇది మంచి అవకాశం. సద్వినియోగం చేసుకోవాలి.
– లంబు అనూష, కంప్యూటర్స్ విద్యార్థిని
నా సాలరీ రూ.40 వేలు
డిగ్రీ చదువుతున్న సమయంలో బీబీఏ చదువుతూ ఎంఎన్సీ సంస్థలో ఉద్యోగానికి ఎంపికయ్యా. మొదటి నెల సాలరీ 40 వేలు తీసుకున్నా. మనకున్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ, చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటే మంచి అవకాశాలు వస్తాయి. ఎంపికైన సంస్థలోనూ ప్రతిభ చూపించగలిగితే సాధ్యమైనంత త్వరలోనే ప్రమోషన్లు కూడా వస్తాయి.
– వాసాల ప్రజ్ఞ, బీబీఏ, నొటాటో ఉద్యోగిని