కరీంనగర్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): తొలకరి పలుకరించింది. శనివారం రాత్రి జిల్లా లో వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 16.6 మిల్లీమీటర్లుగా నమోదైంది. అత్యధికంగా చొప్పదండిలో 60, తిమ్మాపూర్‌లో 45 మిల్లీమీటర్లు కురిసింది. గంగాధరలో 18.2, కరీంనగర్లో 15.4, జమ్మికుంటలో 11.2 మిల్లీమీటర్లు కురిసింది. మిగతా మండలాల్లో అక్కడక్కడా చిరు జల్లులు, మోస్తరు వర్షం కురిసింది. ఎండ వేడితో సతమతమైన జిల్లా వాసులకు వర్షంరాకతో ఉపశమనం దొరికింది. ఆదివారం పగటి ఉష్ణోగ్రతల్లో మార్పులు కనిపించాయి. 34.0 డిగ్రీల ఎండ మాత్రమే నమోదైంది.
సాగుకు సన్నద్ధం..
కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉమ్మడి జిల్లా వాటర్ హబ్‌గా మారడం.. చెరువులు, కుంటల్లో పుష్కలంగా జలాలు ఉండడం, పైగా రాష్ట్ర సర్కారు ఎరువులు, విత్తనాలు అందిస్తుండడంతో రైతులు ఉత్సాహంగా సాగుకు సమాయత్తమవుతున్నారు. అయితే ఎండల తీవ్రత విపరీతంగా ఉండడంతో రైతులు సాగు పనులు ఆలస్యంగా ప్రారంభిస్తున్నారు. శనివారం రాత్రి కురిసిన వర్షం కాస్త ఉపశమనాన్ని ఇచ్చినా సాగు పనులు ప్రారంభించే పరిస్థితి అయితే ఉండదని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బావులు, బోర్ల కింద నీళ్లు ఉన్న రైతులు ఇప్పటికే అనేక చోట్ల నార్లు పోసుకున్నారు. దుక్కులు తడిపి పచ్చి రొట్ట కింద జనుము, జీలుగ విత్తనాలు వేసుకున్నారు. వానాకాలం ప్రణాళికను సిద్ధం చేసిన అధికారులు ఇప్పటికే రైతు వేదికల్లో అన్నదాతకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలను నిర్వహించి సాగుకు సన్నద్ధం చేశారు.
ఏ మండలంలో ఎంత వర్షం..
నిజానికి జూన్ 10 నుంచి వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఈ నెలలో ఇప్పటి వరకు అక్కడక్కడా చిరుజల్లులు కురిసినా.. శనివారం రాత్రి మాత్రం భారీ నుంచి మోస్తరు వర్షం కురిసింది. అధికారులు అందించిన వివరాల ప్రకారం గంగాధరలో 18.2 మిల్లీమీటర్లు, రామడుగులో 7.2, చొప్పదండిలో 60.0, కరీంనగర్లో 15.4, మానకొండూర్‌లో 8.4, తిమ్మాపూర్‌లో 45.6, చిగురుమామిడిలో 12.8, సైదాపూర్‌లో 2.0, శంకరపట్నంలో 6.2, వీణవంకలో 9.4, హుజూరాబాద్‌లో 3.2, జమ్మికుంటలో 11.2 చొప్పున జిల్లా సగటు వర్ష పాతం 16.6 మిల్లీమీటర్ల చొప్పున నమోదైంది.