ధర్మారం, జూన్12: ధర్మారం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం కొలువుదీరబోతున్నది. వ్యవసాయ మార్కెట్ యార్డు వేదికగా సోమవారం ప్రమాణస్వీకారోత్సవం జరుగనుండగా, మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. ఈ మేరకు ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి అధ్వర్యంలో వైస్ చైర్మన్ చొప్పరి చంద్రయ్య, పాలక వర్గ సభ్యులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. వివరాల్లోకి వెళితే.. కొత్తపల్లికి చెందిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి కొంతకాలంగా పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో అతని పనితీరును గుర్తించిన మంత్రి ఈశ్వర్ ప్రత్యేక సిఫారసుతో బుచ్చిరెడ్డికి ఏఎంసీ చైర్మన్ పదవి, ఇతరులకు వైస్‌చైర్మన్, డైరెక్టర్ పదవులు వరించాయి. చైర్మన్‌గా బుచ్చిరెడ్డి, వైస్ చైర్మన్‌గా చొప్పరి చంద్రయ్య, డైరెక్టర్లుగా నాడెం శ్రీనివాస్, మంచెర్ల లచ్చయ్య, దేవి వీరేశం, సాగల కొమురేశం, గుండా సత్యనారాయణ రెడ్డి, సందినేని కొమురయ్య, ఎండీ బాబా, రేగుల లక్ష్మీ, అజ్మీరా తిరుపతి నాయక్, మిట్ట సత్తయ్య, యాంసాని మహేశ్, దైత శ్రీనివాస్‌గా నియమితులుకాగా, పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి సోమవారం ఉదయం ఉదయం 11 గంటలకు ముహూర్తం ఖరారైంది. కాగా, మంత్రి ఈశ్వర్‌ను స్వాగతిస్తూ, కొత్త పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానులు, టీఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
అంకిత భావంతో పనిచేస్తా..
మొదట నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టిన మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన ఆదేశాలను శిరసా వహిస్తా. అంకితభావంతో పనిచేస్తా. రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందిస్తా. మార్కెట్‌కు మంచి పేరు తెస్తా.
– కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, ఏఎంసీ చైర్మన్