కలెక్టరేట్, జూన్ 12 : పరమత సహనానికి ప్రతీక తెలంగాణ అని, రాష్ట్రంలో అన్ని మతాలకు రాష్ట్ర ప్రభుత్వం సమాన గౌరవం ఇస్తున్నదని, ఈ క్రమంలో హజ్ యాత్రికులకు తగిన ఏర్పాట్లు చేస్తున్నదని రాష్ట్ర పౌర సరఫరాల, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారికి నగరంలోని హుస్సేన్పుర నేషనల్ ఫంక్షన్ ప్యాలెస్‌లో ఆదివారం వ్యాక్సినేషన్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శతాబ్దాల నాటి నుంచి దేశంలోని హిందూముస్లింలు కలిసి మెలిసి ఉంటున్నారని, పరమత సహనానికి ప్రతీక అయిన రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి, లబ్ధి పొందేందుకు ఓ పార్టీకి చెందిన వ్యక్తి ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. ఇప్పటికే ఆపార్టీ జాతీయ నేతలు చేసిన వ్యాఖ్యలతో భారతదేశం ప్రపంచ దేశాల ఎదుట తలెత్తుకోలేని దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూముస్లింల మధ్య సోదర భావానికి కరీంనగర్ జిల్లా ఆదర్శమని, ఇదే విధానం దేశమంతా పాటిస్తే మతతత్వవాదులు పన్నే కుట్రలు, కుతంత్రాలకు చెల్లుచీటి చెప్పవచ్చన్నారు.
తెలంగాణ హజ్ కమిటీ సభ్యుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ మక్కా దర్శనానికి వెళ్ళే యాత్రికులకు ఈశిబిరంలో ఉచితంగా వ్యాక్సినేషన్ చేస్తున్నట్లు తెలిపారు. సర్వమత స్వేచ్ఛ తెలంగాణలో మాత్రమే ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, పారదర్శకంగా అమలు చేస్తున్నారని కొనియాడారు. యాత్రికులకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటామని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమను ఫోన్లో సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా హజ్ యాత్రికుల సావనీర్‌ను మంత్రి గంగుల ఆవిష్కరించారు. అనంతరం ప్రార్థన సామగ్రి యాత్రికులకు అందజేశా రు. కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్‌రావు, సుడా చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మనరావు, హాజ్ కమిటీ సభ్యుడు ఇర్ఫాన్ ఉల్ హక్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ షమీ, కోఆప్షన్ సభ్యుడు అంజద్‌అలీ, టీఆర్ఎస్ నాయకులు హఫీజ్, మొయినొద్దిన్ ఖాద్రీ, జమీలొద్దిన్, కార్పొరేటర్లు శర్పొద్దీన్, అఖిల్ ఫిరోజ్, బర్కత్ అలీ, అజర్ దబీర్, అలీబాబా పాల్గొన్నారు.