సీసీసీ నస్పూర్, జూన్ 12: మైనింగ్ స్టాఫ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం సీసీసీ నస్పూర్‌లోని టీబీజీకేఎస్ యూనియన్ కార్యాలయంలో శ్రీరాంపూర్ ఏరియా ఎస్సార్పీ-3గని మైనింగ్ స్టాఫ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మైనింగ్ స్టాఫ్ సిబ్బంది పలు సమస్యలను రాజిరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. 2011 నుంచి 2016 మధ్య సింగరేణిలో ఉద్యోగాలు పొందిన 800మంది జేఎంఈటీలకు సీఎంపీఎఫ్ సెటిల్ కాక ఇబ్బంది పడుతున్నారని, 2018లో మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కోసం టీబీజీకేఎస్ యూనియన్ ఒకసారి అవకాశం కల్పించిందని, మరోసారి అవకాశం కల్పించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. గనుల్లో మైనింగ్‌స్టాఫ్ సంఖ్య తక్కువగా ఉండడంతో పనిభారం పెరుగుతున్నదని, సెలవులు కూడా ఇవ్వడంలేదన్నారు. మైనింగ్‌స్టాఫ్ సంఖ్యను పెంచడానికి కృషి చేయాలని వారు కోరారు. క్వార్టర్ల కేటాయింపులో మైనింగ్ స్టాఫ్‌కు మొదటి ప్రాధాన్యత ఉండేదని, ప్రస్తుతం మూడో స్థానానికి తీసుకెళ్లారని తెలిపారు.
సమస్యలపై మిర్యాల రాజిరెడ్డి సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. యూనియన్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో సీఎం కేసీఆర్ ద్వారా సింగరేణి ఉద్యోగులకు అనేక హక్కులు, సమస్యలను పరిష్కరించినట్లు వివరించారు. రాబోయే ఎన్నికల్లో మైనింగ్ స్టాఫ్ సోదరులు తమ యూనియన్‌కు అండగా ఉంటే, మరిన్ని హక్కులు కల్పిస్తామని, సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా గనికి చెందిన 23మంది మైనింగ్ సర్దార్లు, షార్ట్ఫైరర్లు, సర్దార్లు మిర్యాల రాజిరెడ్డి సమక్షంలో టీబీజీకేఎస్‌లో చేరగా, వీరికి ఆయన కండువాలు కప్పి యూనియన్‌లోకి ఆహ్వానించారు. శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గని పిట్ కార్యదర్శి గోపాల్‌రెడ్డి, చర్చల కమిటీ సభ్యుడు వెంగల కుమారస్వామి, నాయకులు ల్యాగల శ్రీనివాస్, అన్వేశ్‌రెడ్డి, వినోద్, ఉత్తేజ్, హైదర్, సారయ్య, వీరమల్లు తదితరులు పాల్గొన్నారు.