వాళ్లంతా 41 ఏండ్ల క్రితం కరీంనగర్ గంజ్ హైస్కూల్ అనే చదువులమ్మ చెట్టునీడన చేరారు. ఏండ్ల పాటు కలిసి చదివారు. ఆడిపాడారు. 1980-81 పదో తరగతి పూర్తి చేసిన తర్వాత ఉన్నత చదువుల కోసం దూరమయ్యారు. మళ్లీ ఇన్నేండ్ల తర్వాత కలుసుకున్నారు ఆ పూర్వ విద్యార్థులు! మానకొండూర్ మండలం ఖాదర్‌గూడెంలో ఆదివారం ‘ఆత్మీయ సమ్మేళనం’ నిర్వహించి, ఒక్కసారిగా చిన్న పిల్లల్లా మారిపోయారు. అలనాటి స్మృతులను నెమరేసుకుంటూ.. ఒకరిని ఒకరు ఆటపట్టిస్తూ.. యోగక్షేమాలు తెలుసుకుంటూ రోజంతా సరదాగా గడిపారు. ఇక ముందు ఎవరికి ఏ ఆపదొచ్చినా కలిసికట్టుగా ఉందామని నిర్ణయించుకున్నారు. నాడు తమకు విద్యా బుద్ధులు నేర్పించిన గురువులను శాలువాలతో సన్మానించారు.
మానకొండూర్ రూరల్, జూన్ 12: కరీంనగర్ పట్టణంలోని జడ్పీ ఉన్నత ప్రభుత్వ పాఠశాల (గంజ్) పూర్వ విద్యార్థులు 41 ఏండ్ల తర్వాత కలుసుకున్నారు. 1980-81 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు అందరూ మళ్లీ కలుసుకోవాలనే ఆలోచనతో ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. నాటి మిత్రులను ఒక్కొక్కరిని అందులో చేర్చుకుంటూ వివరాలు సేకరించారు. ఆదివారం 122 మంది మిత్రులు మానకొండూర్ మండలం ఖాదర్గూడెంలోని అరవింద రిస్టార్ట్స్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్‌లాల్ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. మన మంచిని కోరే ఏకైక వ్యక్తి దోస్తు మాత్రమేనని, నవ్వుతూ, నవ్విస్తూ, సంతోషంగా ఒక్క దోస్తుతో మాత్రమే ఉండగలుగుతామన్నారు. పాలు నీళ్లు ఎలా కలగలసిపోతాయో దోస్తు కూడా అంతేనని, ఒకరి బాధనైనా.. సంతోషాన్నైనా మరొకరు పంచుకుంటారని చెప్పారు. ‘జై హింద్ – జై దోస్తాన్’ అనేది మరచిపోవద్దనీ గుర్తు చేశారు. మనం చదివిన పాఠశాలకు ఏదైనా సాయం చేయాలనే సంకల్పం ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మనలో ఎవరికైనా ఆపదొస్తే వారికి ఆర్థిక సాయం అందించేందుకు ఒక ప్రణాళికను తయారు చేసుకున్నామని పూర్వ విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు జీ వెంకట రెడ్డి, సీ వెంకట రెడ్డి, బీ రాజేశం, ఉమాదేవి, సత్యనారాయణ, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ రోజును మరిచిపోలేను
122 మందిమి ఒక్క వేదికగా కలిశాం. చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నాం. నాటి మధుర స్మృతులను నెమరేసుకున్నాం. అందరం సంతోషంగా గడిపాం. ఈ రోజును నా జీవితంలో మరిచిపోలేని రోజు. అనారోగ్యంతో బాధపడే మా బ్యాచ్ మిత్రులకు ఏదైనా ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకు ఓ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాం. మా వంతు సాయాన్ని అందించి ఆదర్శంగా నిలుస్తాం.
– బల్బీర్ సింగ్, సూపరింటెండెంట్ (ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్)
సంతోషంగా గడిపాం
మేమంతా 41 ఏండ్ల తర్వాత కలుసుకున్నాం. చాలా హ్యాపీ. అందరం ఒకే వేదికగా కలుసుకోవడం ఓ కొత్త అనుభూతి. మిత్రులందరీ యోగక్షేమాలను తెలుసుకున్నాం. సాదకబాధకాలను పంచుకున్నాం. చిన్ననాటి గుర్తులను నెమరేసుకున్నాం. ఇలానే మా స్నేహం కలకాలం ఉండాలని కోరుకున్నాం. అందరం సంతోషంగా గడిపాం.
– కోడూరి శ్రీనివాస్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు
41 ఏండ్ల నాటి గుర్తులు నెమరేసుకున్నాం..
2016 డిసెంబర్ 11న మొదటసారి పదమూడు మంది మిత్రులం మేం చదివిన గంజ్ హైస్కూల్ వద్ద కలిశాం. అప్పటి నుంచే అందరి మిత్రుల నంబర్లు సేకరించాం. అంతా కలిసి ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవాలని అనుకున్నాం. కానీ, కొన్ని అనివార్య కారణాల కలువలేకపోయాం. 2019లో కలువాలని అనుకున్నా కొవిడ్ కారణంగా కలువలేక పోయాం. చివరగా కొంత మంది ఫ్రెండ్స్ దృఢ సంకల్పంతో రెండు మూడు పర్యాయాలు కలిసి ఈ రోజు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాం. 41 ఎండ్ల నాటి గుర్తులను నెమరేసుకున్నాం. అనుభవాలను పంచుకున్నాం. అందరం సమాజంలో గొప్పగా ఉన్నందుకు సంతోషంగా ఉన్నాం.
– శ్రీరామోజు నాగార్జున, తహసీల్దార్,జగిత్యాల కలెక్టర్ కార్యాలయం
చిన్న పిల్లల్లా గడిపాం
1980-81 సంవత్సరంలో పదో తరగతి చదివాం. అందరం మంచిగా స్థిరపడ్డాం. మేము కలిసేందుకు ఓ వాట్సాప్ వేదికను ఏర్పాటు చేసుకున్నాం. రెండు నెలల నుంచి దేశ, విదేశాల్లో ఉన్న వారికి సైతం వివరాలను అందిస్తూ.. వారి పుట్టిన తేదీలను, వారి మ్యారేజీ తేదీలను నోట్ చేసుకొని వారికి విషెస్ చెప్పుకుంటున్నాం. వాట్సాప్ గ్రూప్ కారణంగా నేడు ఆత్మీయ సమ్మేళనం జరుపుకోగలిగాం. అందరం చిన్న పిల్లలం అయిపోయాం. ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపాం. మేం చదివిన పాఠశాలకు ఏదో విధంగా సాయపడాలని అనుకున్నాం.
– కనపర్తి దివాకర్, ఉపాధ్యాయుడు
ఒక్కటిగా చేరడం చాలా హ్యాపీ
41 ఏండ్ల క్రితం ఫ్రెండ్స్‌ను కలుసుకున్నాం. చాలా హ్యాపీగా ఉన్నది. ఈ విధంగా కలిసేందుకు ప్రయత్నించిన నా ఫ్రెండ్స్ నరసింహస్వామి, నాగార్జున, బల్బీర్ సింగ్, దివాకర్, శ్రీనివాస్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంట్లో ఉన్నోళ్లమే కలిసి పని చేయాలంటే సాధ్యపడదు. అలాంటిది ఇన్నేండ్ల కింద కలిసి చదువుకున్న మమ్మల్ని కలపడం అనేది అంత సులభం కాదు. ఏదేమైనా మేమంతా ఒక్కటిగా చేరడం చాలా హ్యాపీ.
– కే ధర్మరాజు, రేషన్ డీలర్