కరీంనగర్ రూరల్: జూన్ 11: దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ తెచ్చిన దళితబంధును లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. శనివారం కరీంనగర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కరీంనగర్ మండలంలోని తాహెర్ కొండాపూర్‌కు చెందిన 27 మంది లబ్ధిదారులకు మంజూరైన యూనిట్లను మంత్రి పంపిణీ చేసి, మాట్లాడారు. మహనీయుడు అంబేద్కర్ కన్న కలలు దేశంలో ఎక్కడా నెరవేరడం లేదని, ఒక్క తెలంగాణలో సాకారమవుతున్నాయని ఉద్ఘాటించారు. దళితులు సామాజికంగా, ఆర్థికంగా చాలా వెనుకబడ్డారని, వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్ది, బతుకుబాట చూపాలనే ఉద్దేశ్యంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ తెచ్చారన్నారు. ఎలాంటి బ్యాంకు గ్యారంటీ లేకుండా.. వడ్డీ కట్టనవసరం లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 లక్షలు జమ చేస్తున్నారన్నారు.
లబ్ధిదారులు లాభదాయకమైన యూనిట్లను ఎంపిక చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఇప్పటివరకు పథకం కింద కరీంనగర్ జిల్లాలో 17వేల యూనిట్లను ఎంపిక చేశామని, 12,750 యూనిట్లు గ్రౌండింగ్ పూర్తిచేసినట్లు వివరించారు. మిగతావారికి త్వరలో అందిస్తామని చెప్పారు. దళితులు ఇగురంతో వ్యవహరిస్తున్నారని, ఇద్దరు, ముగ్గురు కలిసి సమష్టిగా యూనిట్లు పెట్టుకోవడం సంతోషంగా ఉందన్నారు. నిన్నామొన్నటి దాకా కూలీలుగా పనిచేసిన వారిని ఈ రోజు ఓనర్లుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. దళితబంధు యూనిట్లు పక్క దారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా కల్టెకర్ ఆర్వీ కర్ణన్ లబ్ధిదారులతో కాసేపు ముచ్చటించారు. యూనిట్లు నడపడంలో ఉన్న అనుభవం, ఎలా ఆర్థికాభివృద్ధి సాధిస్తారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.
పల్లె ప్రగతితో గ్రామాలకు కొత్తందాలు..
పల్లెల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తెచ్చిన పల్లె ప్రగతితో గ్రామాలు కొత్తరూపు సంతరించుకుంటున్నాయని మంత్రి గంగుల పేర్కొన్నారు. గ్రామాల్లో ఎన్నోఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతున్నాయన్నారు. ముఖ్యంగా విద్యుత్ ప్రాబ్లమ్స్ ప్రజలను వేధిస్తున్నాయని, ఈ క్రమంలో ఎలక్ట్రిక్ డే కింద వేగంగా పరిష్కరిస్తున్నామన్నారు. ఇక్కడ అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, ఇన్చార్జి ఎంపీడీవో సంపత్‌కుమార్, కరీంనగర్ జడ్పీటీసీ పురుమల్ల లలిత, కాశెట్టి శ్రీనివాస్, వైస్ ఎంపీపీ నారాయణ, గ్రామాల సర్పంచులు మడికంటి మమత, వడ్లూరి సంతోష, పురుమల్ల శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్లు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, బల్మూరి ఆనందరావు, సింగిల్ విండో వైస్ చైర్మన్ బీరం అంజనేయులు, సుంకిశాల సంపత్‌రావు, ఎంపీటీసీ బుర్ర తిరుపతి, ఎల్కపల్లి స్వరూప చంద్రమోహన్, వడ్లూరి కిరణ్, లక్ష్మన్, శ్రీహరి, అనిల్, శంకర్, గాండ్ల కొమురయ్య, చింత లక్ష్మన్, అంజయ్య, జక్కినపల్లి శంకర్, తోట రాములు, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ఉన్నారు.
హార్వెస్టర్ కొంటానని జీవితంలో అనుకోలె..
నేను చాలా ఏండ్ల సంది హర్వెస్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న. వచ్చినదాంట్లో కుటుంబాన్ని పోషించుకుంటున్న. ఎన్ని రోజులు డ్రైవర్‌గా పనిచేయాలి..? నేనే బండి కొనుక్కుంటే మంచిగ ఉంటదని చాలా కష్టపడ్డా. కానీ ఏం లాభం వచ్చిన డబ్బులు ఖర్చులకే చాలకపోతుండే. కానీ కేసీఆర్ సార్ పుణ్యమా అని నా కల నెరవేరింది. నాకు, నా కొడుక్కు వచ్చిన డబ్బులతో హార్వెస్టర్ కొనుక్కున్నం. నేను నా జీవితంల ఈ బండి కొనుక్కుంటా అని అనుకోలే. సీజన్ల మస్తు పని ఉంటది. వరి కోస్తే గంటకు రూ.2వేల దాకా దొరుకుతయి. కోతల్లేని టైంల బ్లేడ్ బండిగా వాడుకుంట. రెండు రకాల లాభం ఉంటది. ఇగ మా జీవితాలు బాగుపడ్డట్టే. కేసీఆర్‌కు ధన్యవాదాలు.
– ఇరుకుల్ల చిన్నరాములు( తాహెర్ కొండాపూర్)
నా జీవితం నిలబడ్డది
నాకు కూలీ పని, ఉపాధి పనులే ఆధారం. ఉన్న కొద్దోగొప్పో భూమిలో ఎవుసం చేసుకుంట.. అటు కూలీ పని చేస్తూ బతుకుతున్న. ఊళ్లే పనిలేకపోతే టౌనుకు పోయి పనిచేసేటోన్ని. ఎంత చేసినా బట్ట, పొట్టకే అయితుండే. ఏదైనా దుకాణమో, వ్యాపారమో చేద్దామంటే అంతస్థోమత లేక ఊకున్న. దళిత బంధు నాకు నాకు బతుకుచూపింది. ట్రాక్టర్, ట్రాలీ, కల్టివేటర్, తీసుకున్న. నాకు ఎంతటి కరువులనైనా పని ఉంటది. సీజన్ల మంచి కిరాయి దొరుకుతది. నా జీవితం నిలబడ్డట్టే. చానా సంతోషం. కేసీఆర్ సారుకు రుణపడి ఉంట.
– ఇరుగురాల శ్రీను, తాహెర్ కొండాపూర్
ముగ్గురం కలిసి జేసీబీ కొన్నం..
మా కుటుంబానికి ఏ ఆధారం లేదు. ఇంట్లోని అందరం పనిచేస్తేనే ఇల్లు గడుస్తది. దళిత బంధు కింద నాకు, మా తమ్ముడు నాగభూషణం, అమ్మ ఎల్లమ్మకు డబ్బులు వచ్చినయ్. నాకు ఒకప్పుడు జేసీబీ డ్రైవర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అందుకే ముగ్గురం కలిసి ఒకే యూనిట్ కింద జేసీబీ కొనుక్కున్నం. మా ముగ్గురికి 29,70,300 వస్తే.. వాటికి రూ.3లక్షలు కలిపి బండి తీసుకున్నం. గ్రామాలల్ల జేసీబీకి మస్తు గిరాకీ ఉంటది. ఒక గంట నడిస్తేనే కిరాయి కింద రూ.1500 వస్తయ్. ఎప్పుడూ పని ఉంటది. మాకు ఉపాధి దొరికినట్లే. మంచిగా పనిచేసుకొని ఆర్థికంగా ఎదుగుతం.
– ఇరుగురాల అంజయ్య, తాహెర్ కొండాపూర్
వరి నాటేసే మిషన్ కొన్నం..
మా ఊళ్లే వ్యవసాయం బాగుంటది. నేను చిన్నప్పటి నుంచి ఎవుసం మీద ఆధారపడే బతుకుతున్న. వరి నాటేసే మిషన్ మీద పనిచేసిన అనుభవంతో ఇప్పుడు అదే మిషన్ కొనుకున్న. నాకు రూ.10లక్షలు వస్తే మరో రూ.3లక్షలు కలిసి తీసుకున్న. సీజన్ల ఈ మిషన్‌కు మస్తు గిరాకీ ఉంటది. దీంతో రెండు గంటలల్లనే మూడు ఎకరాల్లో నాటేయచ్చు. ఎకరానికి రూ.4వేల దాకా దొరుకుతయి. కష్టపడి పనిచేసి జీవితంలో నిలదొక్కుకుంటా. మా కోసం ఇలాంటి పథకం ఒకటి వస్తుందని అస్సలు ఊహించలే. చాలా సంతోషంగ ఉంది. నా బతుకుమార్చిన కేసీఆర్‌ను ఎన్నటికీ మర్చిపోను.
-ఇరుగురాల మల్లయ్య, తాహెర్ కొండాపూర్
నిన్న డ్రైవర్.. నేడు ఓనర్
కింది చిత్రంలో విజయసంకేతం చూపుతున్న వ్యక్తి పేరు లింగపల్లి శ్రీహరి. చాలా పేద కుటుంబం. ఉన్న ఎకరం భూమితోపాటు మరికొంత పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటున్నడు. 33 ఏండ్లుగా ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నడు. ట్రాక్టర్ కొనుక్కోవాలనే ఆశ ఉన్నా ఆర్థిక స్థోమత లేక ఆశ చంపుకున్నడు. అలాగే ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నడు. కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ తెచ్చిన దళిత బంధుతో ఆయన కల నెరవేరింది. పథకం కింద ట్రాక్టర్ ఎంపిక చేసుకోగా, శనివారం కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ చేతులమీదుగా తాళంచెవి అందుకొని మురిసిపోయిండు. సీఎం కేసీఆర్ వల్లే చిరకాల కోరిక నెరవేరిందని, చాలా సంతోషంగా ఉందని శ్రీహరి చెబుతున్నడు. ఇప్పుడున్న భూమితోపాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తానని, ట్రాక్టర్తోనూ ఉపాధి పొందుతానని అంటున్నాడు. ఇలా ఈ ఒక్క శ్రీహరే కాదు ఎందరో మందికి దళితబంధు బతుకుదెరువుగా మారింది.