కోల్‌సిటీ, జూన్ 11 : రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మిషన్ భగీరథ పథకం రామగుండం ప్రాంత వాసులు ఏండ్లపాటు ఎదుర్కొన్న తాగునీటి కష్టాలను దూరం చేసింది. అంతే కాకుండా, ప్రతి ఒక్కరికీ శుద్ధ జలం అందిస్తున్నది. పక్కనే గోదావరి ఉండడం, కాళేశ్వరం ప్రాజెక్టుతో నిండుకుండలా మారడంతో భవిష్యత్‌లోనూ తాగునీటికి ఇబ్బందులు ఉండే అవకాశాలు లేవు.
మూడు నియోజకవర్గాలకు ఇక్కడ నుంచే…
కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాని తలాపున ఉన్న గోదావరి ఏడాది పొడవునా నిండుకుండను తలపిస్తున్నది. దీని ఆధారంగా మిషన్ భగీరథ ద్వారా రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని రామగుండం, ఎన్టీపీసీ, గోదావరిఖని, యైటింక్లయిన్‌కాలనీ ప్రాంతాల్లో నిరంతరం నీటి సరఫరా జరుగుతున్నది. రామగుండం మండలం ముర్మూరు వద్ద వాటర్ ప్లాంట్ నుంచి నీటిని శుద్ధి చేసి వాటిని పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాలకు సరఫరా చేస్తున్నారు. ఎండకాలంలోనూ ప్రజలకు నీటి సమస్య రాకుండా రోజు విడిచి రోజు అందించారు. ఈ వాటర్ ప్లాంట్ ఒక్క రామగుండం నియోజకవర్గానికే రోజుకు 39 మిలియన్ లీటర్ల నీటి అవసరాలను తీరుస్తున్నది. కార్పొరేషన్ పరిధిలో గతంలో 20 వేల నీటి కనెక్షన్లు ఉండగా, మిషన్ భగీరథ ద్వారా అవి 41 వేలు అయ్యాయి. ఎల్కలపల్లి, న్యూమారేడుపల్లి గ్రామాలకు ప్రతి రోజూ క్రమం తప్పకుండా నీటిని సరఫరా చేస్తుండగా, మిగతా ప్రాంతాలకు రోజు విడిచి రోజు చేస్తున్నారు. కొత్తగా నిర్మించిన పీఎస్ లైన్ ద్వారా లీకేజీల సమస్యలకు స్వస్తి పలికారు. కార్పొరేషన్ పరిధిలోని బీ పవర్‌హౌస్, ఎన్టీపీసీ హెలీప్యాడ్, శారదానగర్, అశోక్‌నగర్, పాత మున్సిపల్ ఆఫీసు, సంజయ్ గాంధీనగర్, రమేశ్‌నగర్ మెటర్నిటీ హాస్పిటల్, ఎల్కలపల్లి, అల్లూరు, మారేడుపాక ప్రాంతాల్లో గతంలోనే సుమారు రూ.1.30 కోట్ల వ్యయంతో నీటి ట్యాంకులను నిర్మించగా, విఠల్‌నగర్, సీఎస్పీ-1, భీమునిపట్నంలో అదనంగా రూ.30 లక్షలతో టా్ంయకులు నిర్మించారు. వీటిద్వారా నిరంతరం నీటి సరఫరా చేస్తున్నారు.
గుట్ట మీద నీటి ట్యాంకు
రామగుండం కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులు నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి గుట్ట మీద నీటి ట్యాంకు నిర్మించడంతో నీటి సరఫరాకు భారం తప్పుతున్నది. ముర్మూరు వద్ద గుట్ట మీద నిర్మించిన ట్యాంక్ నుంచి గ్రావిటీ ద్వారా మూడు నియోజకవర్గాలకు నీటి సరఫరా జరుగుతున్నది. గతంలో వాటర్ ట్యాంకు నుంచి మోటార్ల ద్వారా సరఫరా చేయాలంటే ప్రతి నెలా రూ.15 లక్షల వరకు నగర పాలక సంస్థకు విద్యుత్ చార్జీల రూపేణా భారం పడేది. కానీ, మిషన్ భగీరథ ద్వారా రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ ట్యాంక్ నుంచి ఎలాంటి మోటార్ల సాయం లేకుండానే మంచి నీరు వెళ్తున్నది. ఈ పద్ధతి ద్వారా మెరుగైన రీతిలో నీటి సరఫరా చేస్తున్నందుకు 2020, 2021లో రాష్ట్ర ప్రభుత్వం రామగుండం నగరపాలక సంస్థకు రోల్ కో అవార్డులను ప్రదానం చేసింది.
ప్రతి ఇంటికీ శుద్ధజలం అందించడమే లక్ష్యం
రామగుండం నియోజకవర్గ ప్రజలకు శుద్ధజలం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఎన్నో ఏళ్లుగా ఉన్న తాగునీటి సమస్యకు మిషన్ భగీరథ ద్వారా శాశ్వత పరిష్కారం లభించింది. ముర్మూరు వాటర్ ప్లాంట్ నుంచి జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు ఇక్కడి నుంచి మంచినీటి సరఫరా జరుగుతున్నది. కానీ, ఇటీవల ఆర్ఎఫ్సీఎల్ కర్మాగారం నుంచి వెలువడే వ్యర్థ జలాలు నేరుగా వచ్చి గోదావరిలో కలవడం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజలకు అనారోగ్యం పొంచి ఉందని గ్రహించి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేశా. ఆర్ఎఫ్సీఎల్లో ఒకరోజు ఉత్పత్తి కూడా నిలిపివేసేలా చర్యలు తీసుకున్నరు. రామగుండంలోని వివిధ పరిశ్రమలు గోదావరి వద్ద నీటి శుద్ధి కేంద్రాలు నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటాం.
– కోరుకంటి చందర్, ఎమ్మెల్యే