ఫర్టిలైజర్‌సిటీ/గోదావరిఖని జూన్ 11 : గోదావరిఖనిలోని ఉదయ్‌నగర్‌లో కార్మికుడి కుటుంబం, పాత్రికేయుడిపై దాడికి దిగిన రామగుండం కార్పొరేషన్‌కు చెందిన టీఆర్ఎస్ కార్పొరేటర్‌పై కేసు నమోదైంది. మరో టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్తతో పాటు ఇంకో ఇద్దరు ఈ ఘటనలో ఉండగా, పార్టీ క్రమశిక్షణా సంఘం ముగ్గురిపై బహిష్కరణ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన దాడి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వన్ టౌన్ సీఐ రమేశ్‌బాబు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరిఖని ఐబీకాలనీకి చెందిన సీఎస్పీలో పని చేసే చందుపట్ల వేణుగోపాల్‌రెడ్డి ఇంటికి అతనికి మిత్రుడైన పాత్రికేయుడు ఆరెల్లి కుమార్ వెళ్లాడు.
ఇంట్లో మాట్లాడుతున్న సమయంలో గంగానగర్ వైపు నుంచి వచ్చిన 10వ డివిజన్ కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య, 43వ డివిజన్ కార్పొరేటర్ ధరణి స్వరూప భర్త జలపతి, టీబీజీకేఎస్ నాయకులు పొలాడి శ్రీనివాసరావు, జువ్వాడి వెంకన్న కారులో వస్తూ పార్కింగ్ చేసిన గోపాల్‌రెడ్డి, ఆరెల్లి కుమార్ వాహనాలను ఢీకొట్టి హారన్ మోగించగా ఏం జరిగిందోనని ఇంట్లోని వారంతా బయటకు వచ్చి ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన అడ్డాల గట్టయ్య, జలపతి, పోలాడి శ్రీనివాసరావు, వెంకన్న అకారణంగా వేణుగోపాల్‌రెడ్డిని కొట్టారు. అక్కడితో ఆగకుండా అడ్డుగా వచ్చిన అతని భార్య ప్రమీలాకుమారి, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరి కుమార్, సీఐటీయూకి చెందిన మెండె శ్రీనివాస్‌తోపాటు మరొకరిని చితకబాదారు. అడ్డుగా వచ్చిన వేణుగోపాల్ భార్య నైటీని చించేసి తలుపులను ధ్వంసం చేశారు. ఘటనపై డయల్ 100 ద్వారా తెలుసుకున్న సీఐలు రమేశ్‌బాబు, రాజ్‌కుమార్ అక్కడకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పాత్రికేయులంతా చేరుకొని ధర్నాకు దిగారు. పోలీసులు సముదాయించడంతో సద్దుమణిగారు. అనంతరం పాత్రికేయులు, బాధిత మహిళ ఫిర్యాదు చేశారు. దాంతో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కార్పొరేటర్, మరో ఇద్దరిపై బహిష్కరణ వేటు
టీఆర్ఎస్ 10వ డివిజన్ కారొరేటర్ అడ్డాల గట్టయ్య, మరో కార్పొరేటర్ భర్త ధరణి జలపతి, పొలాడి శ్రీనివాసరావుపై బహిష్కరణ వేటు పడింది. రామగుండం ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం క్రమశిక్షణా సంఘం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రమశిక్షణా సంఘం బాధ్యులు పీటీ స్వామి, పాతపెల్లి ఎల్లయ్య, తోడేటి శంకర్ గౌడ్, మొగిళి ప్రకటించారు. ఇక మీదట పార్టీ నిబంధనలు అతిక్రమించి ప్రజలకు నష్టం చేకూర్చే పనులు చేసినా, అసాంఘిక చర్యలకు పాల్పడినా క్రమ శిక్షణ చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు
టీఆర్ఎస్ క్రమశిక్షణకు మారుపేరని, పార్టీ శ్రేణులు క్రమశిక్షణతో మెలగాలని రామగుండం ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ సూచించారు. పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేపడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. శుక్రవారం రాత్రి గోదావరిఖని ఉదయ్‌నగర్‌లో విలేకరి కుమార్‌పై జరిగిన దాడిని ఎమ్మెల్యే ఖండించారు. శనివారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో బాధితుడితో కలిసి విలేకరులతో మాట్లాడారు. పార్టీకి నష్టం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. దాడికి పాల్పడ్డ కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య, నాయకులు ధరణి జలపతి, పొలాడి శ్రీనివాసరావు, వెంకన్నను టీఆర్ఎస్ నుంచి బహిష్కరించాలని, పార్టీ క్రమశిక్షణ కమిటీని ఆదేశించారు.
-టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కోరుకంటి చందర్