పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఎనిమిదో రోజు శనివారం అధికారులు విద్యుత్ మరమ్మతులు చేపట్టారు. వంగిన పోల్స్ స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడంతోపాటు లూజ్ వైర్లను సరి చేయించి సమస్యలు పరిష్కరించగా, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
హుజూరాబాద్ టౌన్, జూన్ 11: పట్టణ ప్రగతిలో భాగంగా శనివారం హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో పవర్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా వాడల్లో నెలకొన్న పలు విద్యుత్ సమస్యలను తక్షణమే పరిషరించారు. 2, 15, 16, 17,18, 19, 20వ వార్డుల్లో వంగిన విద్యుత్ పోల్స్ సరి చేయడంతో పాటు లూజ్ వైర్లను సరి చేశారు. విద్యుత్తు వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. పలుచోట్ల చేపట్టిన విద్యుత్ పనులను మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, విద్యుత్ శాఖ డీఈ విజేందర్‌రెడ్డి, ఏఈ వీరాచారి పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఇన్చార్జి మున్సిపల్ ఇంజినీర్ జీ సాంబరాజు, టౌన్ ప్లానింగ్ అధికారులు జ్యోత్స్న, అశ్వినిగాంధీ, శానిటరీ ఇన్స్పెక్టర్ పీ అనిల్‌కుమార్, హెల్త్ అసిస్టెంట్ ఎం కిషన్‌రావు, కౌన్సిలర్లు కే రమాదేవి, ఎం సుశీల, యాదగిరినాయక్, ఉజ్మానూరిన్, ప్రత్యేకాధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇల్లందకుంటలో..
మండలంలో శనివారం పల్లెప్రగతి కార్యక్రమాలు కొనసాగాయి. ఆయా గ్రామాల్లో ప్రత్యేకాధికారులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు పారిశుధ్య, ప్లాంటేషన్ పనులను చేపట్టారు. గడ్డివాణిపల్లిలో ప్రభుత్వ పాఠశాల ఆవరణను శుభ్రం చేయించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రత్యేకాధికారులు డీటీ రాజేశ్వరి, ఎంపీవో వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శులు కిషన్, సతీశ్, కొండల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, స్వప్న, సంధ్యారాణి, అంకూస్, రాజేశ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సైదాపూర్‌లో..
పల్లె ప్రగతిలో భాగంగా పలు గ్రామాల్లో పవర్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు స్థానిక విద్యుత్ సమస్యలను తెలుసుకున్నారు. విద్యుత్ సిబ్బంది లూజ్‌వైర్లను సరిచేయడంతో పాటు వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. కార్యక్రమంలో ఎంపీడీవో పద్మావతి, ఎంపీవో రాజశేఖర్‌రెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు.
జమ్మికుంట మండలంలో..
పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగింది. అధికారులు, ప్రజాప్రతినిధులు విద్యుత్ మరమ్మతు పనులు చేపట్టారు. పారిశుధ్య పనులు, మొక్కల సంరక్షణ చర్యలను పరిశీలించారు. గండ్రపల్లి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ బల్గూరి పద్మాసమ్మారావు, ఎంపీటీసీ తోట కవితాలక్ష్మణ్, ఎంపీవో సతీశ్‌కుమార్ వైకుంఠధామంలో సుమారు రూ. లక్షా25 వేలతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. పనులను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రత్యేకాధికారులు, మున్సిపల్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు కౌన్సిలర్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.