కోర్టు చౌరస్తా, జూన్ 11: కోర్టును ఆశ్రయించే బాధితులకు సత్వరం న్యాయం జరిగినప్పుడే సమాజంలో న్యాయస్థానాలపై నమ్మకం ఏర్పడుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ శ్రీసుధ పేర్కొన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన రెండు పోక్సో కోర్టులను శనివారం ఆమె ప్రారంభించారు. అనంతరం కోర్టు ఆవరణలోని మధ్యవర్తిత్వ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్జి మాట్లాడుతూ, న్యాయవాదులు న్యాయమూర్తులు పరస్పర సహకారంతో అధిక సంఖ్యలో కేసులను పరిషరించి మొదటి స్థానంలో నిలువాలని సూచించారు. బాలలపై రోజు రోజుకు నేరాలు పెరిగిపోతున్నాయని, వాటి నియంత్రణకు, సత్వర న్యాయానికి కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బాలల భవిష్యత్‌ను తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులతో పాటు అందరిపై ఉందని జడ్జి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్ వీ నవీన్‌రావు వర్చువల్ ద్వారా మాట్లాడారు. రాష్ట్రంలో జ్యుడీషియల్ జిల్లాల ఏర్పాటుతో కోర్టుల పరిధి తగ్గిందని ఆలోచించవద్దని, జిల్లా కేంద్రంలో రెండు పోక్సో కోర్టుల ఏర్పాటుతో బాలలపై జరిగే నేరాల కేసులు సత్వరం పరిషారవుతాయని పేర్కొన్నారు. ఇతర ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. జిల్లా జడ్జి బీ ప్రతిమ మాట్లాడుతూ, పొక్సో కేసుల పెండెన్సీ, ఇతర అంశాలను వివరించారు. కోర్టు ఆవరణలో హైకోర్టు జడ్జి శ్రీసుధ మొదటగా మొక నాటగా, సర్వమత ప్రార్థనల మధ్య రెండు పోక్సో కోర్టులను ప్రారంభించారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు హైకోర్టు జడ్జిని శాలువా, మెమోంటోతో సత్కరించారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రం రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నాగరాజు, న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.