చొప్పదండి, జూన్ 11: గ్రామాలు, పట్టణాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కరించడానికే రాష్ట్ర ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం చేపడుతున్నదని ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నారు. చొప్పదండి పట్టణంతో పాటు మండలంలో శనివారం 8వ రోజు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం జోరుగా చేపట్టారు. పవర్ డేలో భాగంగా విద్యుత్ సమస్యలను గుర్తించి, పరిష్కరించారు. కాగా, చొప్పదండిలో ఆయా వార్డుల్లో మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్, తహసీల్దార్ రజిత పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో విద్యుత్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమున్న చోట కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి, వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేశారు. కొత్త ఇండ్లపై ఉన్న తీగలను తొలగించారు. విద్యుత్ సిబ్బంది చేపట్టిన పనులను ఇన్చార్జి కమిషనర్ పరిశీలించారు. పట్టణంలో విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఏఈ శంకరయ్యను ఆదేశించారు. పట్టణప్రగతి ప్రత్యేకాధికారి రాంబాబు, ఏఈ రాజేశం, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
మండలంలోని ఆయా గ్రామాల్లో పల్లెప్రగతిలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పాదయాత్ర నిర్వహించారు. గ్రామ పంచాయతీల్లో పవర్డే పాటించారు. గ్రామంలో తుప్పు పట్టిన స్తంభాలు, లూజ్ వైర్లను గుర్తించి, సరిచేశారు. తడి, పొడి చెత్తను వేరు చేయడంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం సెగ్రిగేషన్ షెడ్డును సందర్శించారు. హరితహారంలో భాగంగా గ్రామ పంచాయతీ పరిధిలో మొక్కలకు నీళ్లు పోశారు. ప్లాస్టిక్ నివారణపై అవగాహన కల్పించడంతో పాటు వినియోగించవద్దని సూచించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.