కార్పొరేషన్, జూన్ 11 : 7 వేల లీటర్ల అమ్మకాల నుంచి రోజుకు రెండు లక్షల లీటర్ల పాలను అమ్ముతూ కరీంనగర్ డెయిరీ తెలంగాణలో ప్రథమ స్థానంలో నిలిచిందని డెయిరీ చైర్మన్ చలిమెడ రాజేశ్వర్‌రావు వెల్లడించారు. సంస్థ నాణ్యమైన పాల ఉత్పత్తులను అందిస్తూ వినియోగదారుల మన్ననలను పొందడం గర్వంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. 418 కోట్ల టర్నోవర్‌తో డెయిరీ ప్రగతి పథంలో పయనిస్తున్నదని తెలిపారు. తన 67వ పుట్టిన రోజు సందర్భంగా శనివారం కరీంనగర్‌లోని డెయిరీ ఆవరణలో కేక్ కట్ చేశారు. అనంతరం మొక్క నాటారు. చలిమెడ ఆనందరావు మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించగా, 74 మంది డెయిరీ సిబ్బంది బ్లడ్ డోనేట్ చేశారు. ఈ సందర్భంగా తన జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన సిబ్బందికి రాజేశ్వర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. ధర్మపురి లక్ష్మీనర్సింహాస్వామి, కొండగట్టు అంజన్న దేవస్థాన పూజరులు వచ్చి ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు, స్వామివారల ఫొటోలను అందించారు. ఈ కార్యక్రమంలో డెయిరీ డైరెక్టర్ ఎం ప్రభాకర్‌రావు, మేనేజింగ్ డైరెక్టర్ పీ శంకర్‌రెడ్డి, వైద్యులు రఘురామన్, సీఏ నిరంజనాచారి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.