కార్పొరేషన్, జూన్ 9: నగరంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు మేయర్ వై సునీల్‌రావు పేర్కొన్నారు. నగరంలోని 26వ డివిజన్లో రూ. 50 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను గురువారం ఆయన కార్పొరేటర్ నక్క పద్మ-కృష్ణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, డివిజన్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు.
ఈ ప్రాంతంలో రోడ్లు శిథిలావస్థకు చేరాయని కార్పొరేటర్ తమ దృష్టికి తీసుకురాగా, నిధులు కేటాయించి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అన్ని డివిజన్లలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు సాగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, ఏఈ గట్టు స్వామి, టీఆర్ఎస్ నాయకులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.
కోతుల బెడద నుంచి విముక్తి కలిగిస్తాం
నగరంలో కోతుల బెడద నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తామని మేయర్ యాదగిరి సునీల్ రావు పేర్కొన్నారు. నగరంలో కోతులను పట్టి అటవీ ప్రాంతంలో వదిలేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. 33వ డివిజన్ భగత్‌నగర్‌లో గురువారం పట్టిన 150 కోతులను మేయర్ సునీల్‌రావు, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ పరిశీలించారు. కోతులను పట్టే కాంట్రాక్ట్ సిబ్బందికి మేయర్ పలు సూచనలు చేశారు.
అటవీ ప్రాంతంలో వదిలేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు గత కౌన్సిల్ సమావేశంలో పాలకవర్గంతో చర్చించి కోతులను పట్టాలని తీర్మానం చేశామన్నారు. ఈ మేరకు బల్దియా నుంచి రూ. 10 లక్షలు కేటాయించి కోతులను పట్టే వారిని రప్పించి కాంట్రాక్ట్ అప్పగించామన్నారు. భగత్‌నగర్‌లో సుమారు 150 నుంచి 200 కోతులను పట్టినట్లు తెలిపారు. కోతులను వాహనంలో బల్దియా అధికారుల పర్యవేక్షణలో ఫారెస్టు అధికారుల సూచన మేరకు అటవీ ప్రాంతంలో వదిలేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో ఆహారం, నీరు దొరికే చోట కోతులను వదిలేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఈ నాగమల్లేశ్వర్ రావు, పశువైద్యాధికారి శ్రీధర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.