కమాన్‌చౌరస్తా, జూన్ 9: జిల్లాలో ఈనెల 12న జరిగే టెట్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్‌లాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం ఆయన టెట్ నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మొదటి పేపర్ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో పేపర్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఉంటుందని తెలిపారు. ఓఎంఆర్ షీట్లో ఏదైనా ప్రింట్ సరిగ్గా లేకుంటే విషయాన్ని ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకువస్తే వారు చీఫ్ సూపరింటెండెంట్‌కు నోటీసు చేసి ఓఎంఆర్ స్థానంలో బఫర్ ఓఎంఆర్ షీట్ ఇస్తారని చెప్పారు.
ఇందులో అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూడాలని సూచించారు. ముందుగా ముద్రించిన డేటాలో ఏమైనా వివరాలు తప్పుగా ఉంటే వాటిని దిద్దుబాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని పేర్కొన్నారు. ఈనెల 12న ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని వసతులు ఉన్నాయో లేదో ఒకరోజు ముందుపరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఈవో జనార్దన్ రావు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.