రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ శుక్రవారం జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయన వెంటే మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్ రానున్నారు. ముందుగా మెట్పల్లి మండలం బండలింగాపూర్ గండి హన్మాన్ ఆలయ ఆవరణలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఏర్పాటు చేసిన కోదండరాముడి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు మెట్పల్లి, కోరుట్లలో డబుల్బెడ్రూం ఇండ్ల సముదాయాలకు గృహప్రవేశాలు చేయనున్నారు. అనంతరం కోనరావుపేట మండలం మల్కపేటలో ‘మన ఊరు మనబడి’ కింద మాజీ మంత్రి చల్మెడ ఆనందరావు తల్లి ‘జానకీ దేవి’ జ్ఞాపకార్థం నిర్మించిన పాఠశాల భవనం, వేములవాడలో కస్తూర్బా పాఠశాల భవనానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం మూలవాగు ఒడ్డున నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభిస్తారు.
రాజన్న సిరిసిల్ల, జూన్ 9 (నమస్తే తెలంగాణ)/మెట్పల్లి : రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, రహదారులు, భవనాల శాఖల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లోని బేగంపేట నుంచి హెలీకాప్టర్ ద్వారా నేరుగా కోరుట్ల పట్టణానికి చేరుకుంటారు.
అక్కడి నుంచి మెట్పల్లి మండలం గండిహన్మాన్ ఆలయం ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తాను సొంత ఖర్చులతో తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రతిష్టిస్తున్న 56 అడుగుల కోదండరాముడి భారీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి అర్బన్ హౌసింగ్‌కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని ప్రారంభిస్తారు. తర్వాత మెట్పల్లి పట్టణానికి చేరుకుని టీటీడీ కల్యాణమండపంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన తనయుడు డాక్టర్ సంజయ్ ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్‌ను ప్రారంభిస్తారు.
అనంతరం సమీప వెంకట్‌రెడ్డి గార్డెన్స్‌లో విద్యార్థులు, యువతతో మంత్రి కేటీఆర్ చిట్‌చాట్‌లో పాల్గొంటారు. అక్కడి నుంచి కోరుట్ల పట్టణ శివారులోని పెద్దగుండు ప్రాంతానికి చేరుకుని రెండు డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాలను ప్రారంభిస్తారు. తర్వాత నేరుగా మెట్పల్లి మండలం వెల్లుల్ల శివారులోని వీఆర్ఎం గార్డెన్స్‌లో జరిగే కార్యకర్తల విస్త్రృత స్థాయి సమావేశానికి హాజరవుతారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి లంచ్ చేసి తిరిగి పట్టణంలోని తన మిత్రుడైన జాన్సన్ ఇంటికి వెళ్తారు. అక్కడి నుంచి నేరుగా రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామానికి చేరుకుంటారు.
ఇక్కడ చల్మెడ ఆనందరావు మాతృమూర్తి జానకీదేవి జ్ఞాపకార్థం 1.50 కోట్లతో నిర్మించిన పాఠశాల భవనాన్ని ప్రారంభించి, సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత వేములవాడకు చేరుకుని 3.35 కోట్లతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని, అనంతరం 3 కోట్లతో నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభించి హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు. మంత్రుల రాక సందర్భంగా ఆయాచోట్ల అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, టీఆర్ఎస్ సిరిసిల్ల అధ్యక్షుడు తోట ఆగయ్య గురువారం పర్యవేక్షించారు.
పైసా ఖర్చు లేకుండా సొంతిల్లు
కోరుట్ల, జూన్ 9: కోరుట్ల పట్టణానికి మొదటి విడుతలో 80 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయి. పట్టణ శివారులోని పీవీ నరసింహారావు వైద్య కళాశాల సమీపంలో రెండెకరాల స్థలంలో 80 డబుల్ బెడ్రూం ఇండ్లను జీ ప్లస్ 2 పద్ధతిలో నిర్మించారు. ఒక్కో బ్లాక్‌లో 12 ఇండ్ల చొప్పున 6 బ్లాకులు, జీ ప్లస్ 1 పద్ధతిలో ఒక బ్లాక్‌లో 8 ఇండ్లతో కూడిన గృహ సముదాయాలను నిర్మించి, ప్రారంభానికి ముస్తాబు చేశారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఆదేశాలతో ఇటీవల డబుల్ బెడ్రూం ఇండ్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. అర్హుల సమక్షంలో డ్రా పద్ధతిన కేటాయించారు. శుక్రవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం చేయనున్నారు.
అందమైన రోడ్లు.. ఇరువైపులా పచ్చదనం…
మెట్పల్లి రోడ్డు జాతీయ రహదారిని అనుకొని సకల వసతులతో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. ఇక్కడకు చేరుకోవడానికి 30 లక్షల పట్టణ ప్రగతి నిధులతో సిమెంట్ రోడ్డును నిర్మించారు. రహదారులకు ఇరువైపులా వివిధ రకాలైన పూల మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణకు ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు. 8.90 లక్షలతో నీటి వసతి, విద్యుత్ స్తంభాల ఆధునీకరణ, ట్రాన్స్ఫార్మర్ పనులు పూర్తి చేశారు.