వేములవాడ, జూన్ 9 : స్వరాష్ట్రంలో విద్యా వనరుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పని చేస్తున్నది. ఆధునిక భవనాలు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో రాజీ లేకుండా కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్నది. అంతే కాకుం డా, నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకవస్తున్నది. అందులో భాగంగా వేములవాడ పట్టణంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 200 మంది విద్యార్థులు అభ్యసించే కస్తూర్బా పాఠశాలను రెండెకరాల సువిశాల స్థలంలో 3.35 కోట్లు వెచ్చించి, 8140 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించింది. అందులో ఐదు తరగతి గదులు, భోజనశాల, వంట గది, ల్యాబ్‌కు రెండు గదులు, ఒక ప్రాథమిక చికిత్స గది, ఐదు డార్మెటరీ హాళ్లు, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల గదులు, మరుగుదొడ్లు నిర్మించారు.
3 కోట్లతో వైకుంఠధామం
అంతిమ దశలో గౌరవంగా సాగనంపాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఊరిలో వైకుంఠధామాలను నిర్మిస్తున్నది. వేములవాడ పట్టణంలోని ప్రజలు ఇప్పటి వరకు మూలవాగులో ఖననం చేస్తుండగా తాజాగా 3 కోట్లతో వైకుంఠధామం నిర్మించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ప్రత్యేక అభివృద్ధి నిధులతో రెండో బైపాస్‌లోని మూలవాగు ఒడ్డున నిర్మాణం పూర్తి చేశారు. ఎలాంటి నివాసాలు లేనివారికి ప్రత్యేక గదులు, చితాభస్మం వంటివి భద్ర పరిచేందుకు గదిని కూడా ఏర్పాటు చేశారు. పూజ మండపం, విశ్రాంత గదులు, కట్టెలు నిల్వ చేసేందుకు గది, పిండ ప్రదానం చేసేందుకు స్థలం, స్నానపు గదులను ఏర్పాటు చేశారు.
పరిశీలించిన ప్రజాప్రతినిధులు, అధికారులు
వేములవాడ పట్టణంలో పలు అభివృద్ధి పనులను శుక్రవారం మంత్రులు ప్రారంభించనుండగా గురువారం అధికారులు పరిశీలించారు. మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, మిషన్ భగీరథ ఈఈ సంపత్‌రావు, డీఈవో రాధాకిషన్, కస్తూర్బా పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ పద్మజ, వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి, సిరిసిల్ల ఎస్బీ డీఎస్పీ రవికుమార్, పట్టణ సీఐ వెంకటేశ్, ఎస్బీ సీఐ సర్వర్, కమిషనర్ శ్యామ్‌సుందర్‌రావు, డీఈలు సమ్మిరెడ్డి, ప్రసాద్, ఏఈ సరేశ్, ప్రిన్సిపాల్ స్వప్న, కౌన్సిలర్లు పాల్గొన్నారు.