జగిత్యాల రూరల్, జూన్ 9: యువత సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రవి సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయ కార్యాలయంలో విద్యార్థులకు అవసరమైన స్టడీ చైర్స్, రైటింగ్ ప్యాడ్స్, కూలర్లను గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్‌తో కలిసి కలెక్టర్ రవి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లను దశలవారీగా విడుదల చేస్తున్నదని, అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పారు. ఎస్సీ స్టడీ సరిల్ ద్వారా విద్యార్థులకు రెండు నెలల పాటు గ్రూప్స్ శిక్షణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారా యువతకు యూనిఫాం కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నామని వివరించారు. జగిత్యాల, కోరుట్ల ప్రాంతాల్లో త్వరలో బీసీ స్టడీ సరిల్ ప్రారంభిస్తున్నామని తెలిపారు.
జిల్లాలో మరింత మంది యువతకు సహకారం అందించేందుకు గ్రంథాలయాలను బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాం గం ద్వారా తగిన సహకారం అందజేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో విద్యార్థుల సౌకర్యా ర్థం 150 కుర్చీలు, 150 రైటింగ్ ప్యాడ్స్, 20 కూలర్లు పంపిణీ చేశామన్నారు. త్వరలో షెడ్డు సైతం ఏర్పాటు చేస్తామని అన్నారు. జిల్లాలో అర ఎకరం స్థలంలో త్వరలో రూ.1.5 కోట్ల ఖర్చుతో శాశ్వత గ్రంథాలయ నూతన భవ న నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ, జిల్లా నుంచి సివిల్స్‌లో 374 ర్యాంకు సాధించిన శరత్ నాయక్ సైతం ప్రభుత్వం అందించిన సదుపాయాలు వినియోగించుకుని విజయం సాధించారని, కలెక్టర్ అందించిన గైడెన్స్ విద్యార్థులు పాటించి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మాధురి, జిల్లా గ్రంథాలయ సెక్రటరీ సరిత, గ్రంథాలయ సభ్యుడు మారంపల్లి బాబు, గ్రంథాలయ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మన ఊరు-మన బడిలో వేగం పెంచాలి
జగిత్యాల కలెక్టరేట్, జూన్ 9: జిల్లాలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. మన ఊరు మన బడి కార్యక్రమ అమలు తీరుపై కలెక్టర్ గురువారం అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొదటి దశలో 274 పాఠశాలల్లో మన ఊరు మనబడి కింద ఎంపిక చేయగా ఇప్పటివరకు 173 పాఠశాలల అనుమతులు పూర్తయ్యాయని చెప్పారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి జగన్మోహన్ రెడ్డి, మండల ప్రత్యేకాధికారులు, ఇంజినీరు,్ల సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
జగిత్యాల టవర్ సర్కిల్, జూన్ 9 : కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ధరణి పెండింగ్ మ్యుటేషన్, అక్రమ ఇసుక రవాణా నియంత్రణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో జూమ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బీఎస్ లత, జగిత్యాల, కోరుట్ల, రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.