గంగాధర/కొత్తపల్లి, జూన్ 9 : పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో సమూల మార్పులు వచ్చాయని, సీజనల్ వ్యాధులు కనుమరుగయ్యాయని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి మండలంలోని గట్టుభూత్కూర్లో గురువారం నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సరీ, ఆధునిక వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్డు, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు.
కొత్తపల్లి మండల పరిధిలోని ఎలగందుల గ్రామపంచాయతీలోగల బృహత్ పల్లె ప్రకృతివనాన్ని సందర్శించారు. ముందుగా గట్టుభూత్కూర్లో ఆయన మాట్లాడుతూ పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. చిన్న గ్రామాలతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్రంలో కొత్తగా 4 వేల పంచాయతీలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అలాగే 9 వేల కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసి ప్రతి గ్రామం లో పంచాయతీ కార్యదర్శి ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.
గ్రామాల అభివృద్ధికి ప్రతి నెలా గ్రామ పంచాయతీల ఖాతాల్లో 250 కోట్లను జమచేస్తున్నదన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం కోసం వెయ్యి కోట్లను మంజూరు చేసిందని, ‘మన ఊరు.. మన బడి’ లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం 7 వేల కో ట్లను ఖర్చు చేస్తున్నదన్నారు. పల్లెప్రగతితో గట్టుభూత్కూర్ గ్రామాన్ని ఆదర్శంగా నిలుపుతున్న సర్పంచ్ కంకణాల విజేందర్‌రెడ్డిని అభినందించారు.
ఎలగందులలో మాట్లాడు తూ,బృహత్‌పల్లె ప్రకృతి వనం బాగుందని, దీనిని మోడల్‌గా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, డీపీవో వీరబుచ్చయ్య, డీఆర్డీవో శ్రీలత, అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి సంధ్యారాణి, జడ్పీటీసీ పుల్కం అనురాధ, వైస్ ఎంపీపీ కంకణాల రాజ్‌గోపాల్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవోలు భాస్కర్‌రావు, ఏ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీవోలు జనార్దన్‌రెడ్డి, డీ శ్రీనివా స్, ఏపీఎం పవన్, ఏపీవోలు చంద్రశేఖర్, స్పందన, సర్పంచ్ షర్మిల పాల్గొన్నారు.
ప్రజలు భాగస్వాములు కావాలి
పల్లెప్రగతి కార్యక్రమం నిరంతర ప్రకియ. పల్లెప్రగతిని ప్రారంభించిన తర్వాత గ్రామాల్లో సీజనల్ వ్యాధులు కనుమరుగయ్యాయి. రెండు మూడు కేసులు తప్ప ఎక్కడా డెంగీ, మలేరియా వ్యాధులు లేవు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు పల్లెప్రగతిలో భాగస్వాములై గ్రామాభివృద్ధికి సహకరించాలి.
– కలెక్టర్ ఆర్వీ కర్ణన్
పల్లె ప్రగతితో అనేక మార్పులు
పల్లెప్రగతితో గ్రామాల్లో అనేక మార్పులు వచ్చాయి. కేంద్రం ప్రకటించిన 10 అవార్డుల్లో పది మన పల్లెలకు రాష్ర్టానికి రావడమే ఇందుకు నిదర్శనం. చొప్పదండి నియోజకవర్గంలోని కొడిమ్యాల మండల పరిషత్, వెలిచాల పంచాయతీకి జాతీయ స్థాయి అవార్డులు రావడం మనకు గర్వకార ణం. విద్యార్థులు, యువకులు సెల్ఫోన్లకు బానిసలు కాకుండా ఆటల వైపు మళ్లించేందుకు ప్రభు త్వం గ్రామాల్లో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నది.
– ఎమ్మెల్యే సుంకె రవిశంకర్