రామడుగు, జూన్ 9 : పల్లె ప్రగతితో ప్రతి పల్లె అభివృద్ధిలో ఆదర్శంగా నిలువాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. పల్లెప్రగతిలో భాగంగా రామడుగు మండలం తిర్మలాపూర్, వెలిచాల గ్రామాలను గురువారం ఎమ్మెల్యే సందర్శించారు. ఉదయం తిర్మలాపూర్‌లోని ఎస్సీ కాలనీలో చేపట్టిన స్థానిక అంగన్వాడీ కేంద్రం ఎదుట ఎమ్మెల్యే మొక్కను నాటి నీరు పోశారు. శిథిలావస్థకు చేరిన మురుగు కాలువను పరిశీలించారు. ఎస్సీ కాలనీలో మురుగు కాలువలు నిర్మించాలని, సీసీరోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని, ఇంటింటికీ ఆరు మొక్కలు అందించాలని సూచించారు.
విద్యుత్ స్తంభాలతో ఇబ్బందిగా ఉందని కాలనీ వాసులు తెలుపడంతో మండల విద్యుత్ శాఖ ఏఈతో ఫోన్లో మాట్లాడి, సరిచేయాలని ఆదేశించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్లను ఆగస్టు వరకు అందిస్తుందని, అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇల్లు లేని నిరుపేదలకు ఈ డిసెంబర్ కల్లా డబుల్ బెడ్రూం ఇండ్లను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. వడ్ల కొనుగోళ్లకు సంబంధించి ఎవరైనా ఇబ్బంది పెడితే తనకు కాల్ చేయాలని ఫోన్ నంబర్ ఇచ్చారు. అనంతరం వెలిచాలలో ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొక్క నాటి నీరు పోశారు.
అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం సర్పంచును అభినందిస్తూ వెలిచాల అభివృద్ధిలో జిల్లాకే ఆదర్శంగా నిలుస్తున్నదని కితాబిచ్చారు. దీన్‌దయాళ్ గ్రామీణ్ ఉపాధ్యాయ్ సశక్తీకరణ్ జాతీయ అవార్డును అందుకోవడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచులు వీర్ల సరోజన, బక్కశెట్టి నర్సయ్య, ఎంపీపీ కలిగేటి కవిత, మండల ప్రత్యేకాధికారి ప్రియదర్శిని, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు వీర్ల సంజీవరావు, మిషన్‌భగీరథ డీఈ ప్రభాకర్, ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, జడ్పీ కోఆప్షన్ శుక్రొద్దీన్, ఎంపీవో సురేందర్, ఏపీవో రాధ, ఏఈ సచిన్, మాజీ సర్పంచు వీర్ల రవీందర్రావు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, మహిళా సంఘాల సీఏలు, వీవోలు, సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు కలిగేటి లక్ష్మణ్, తడగొండ నిర్సంబాబు, విష్ణు, రాజు, అజయ్, పన్యాల మహేందర్, కార్యదర్శులు, ఇరు గ్రామాల ప్రజలు, తదిరతులు పాల్గొన్నారు.