కార్పొరేషన్, జూన్ 9: ఇంటింటా ఇంకుడు గుంత నిర్మించుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయని మేయర్ యాదగిరి సునీల్‌రావు పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా గురువారం ఆయన 33వ డివిజన్ (భగత్‌నగర్)లో పర్యటించారు. కాలనీవాసులు నిర్మించుకున్న ఇంకుడు గుంతలను పరిశీలించారు. ఇంకుడు గుంత నిర్మాణంతో కలిగే ప్రయోజనాలపై కాలనీ వాసులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగరంలో ఇంటింటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో నిర్మించిన వాటిని శుభ్రం చేయాలని సూచించారు. బల్దియా నిధులు రూ.7.50 కోట్లు కేటాయించి ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాల్లో ఇంకుడు గుంతల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గుర్తించిన స్థలాల్లో ఇంకుడు గుంతలు నిర్మించేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఇంటి ఆవరణలో బోర్ సమీపంలో ఇంకుడు గుంత నిర్మిస్తే నీటి లభ్యత ఉంటుందని సూచించారు.
నగరంలో ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత నిర్మించుకున్న వారికి బల్దియా ఆధ్వర్యంలో ప్రశంసా పత్రం అందజేసి, సతరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, బల్దియా అధికారులు, టీపీబీవో నవీన్, పశువైద్యాధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, నగరంలోని అన్ని డివిజన్లలో పట్టణ ప్రగతి కార్యక్రమం జోరుగా సాగింది. వీధులు, మురుగు కాల్వలను శుభ్రం చేయించారు. ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించారు.
18వ డివిజన్లో కార్పొరేటర్ సుధగోని మాధవీకృష్ణాగౌడ్ ఆధ్వర్యంలో అంబేదర్ చౌరస్తా ప్రధాన రోడ్డు నుంచి శాతవాహన యూనివర్సిటీ వరకు ఇరువైపులా పెరిగిన చెట్ల కొమ్మలను, రోడ్డు మధ్య డివైడర్లలో నాటిన మొకలకు గుంతలు తీయించారు. డంప్ యార్డులో పేరుకుపోయిన వ్యర్థాలను బ్లేడ్ ట్రాక్టర్‌తో చదును చేయించారు. కార్యక్రమంలో అధికారులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. 41వ డివిజన్లో కార్పొరేటర్ మేచినేని వనజ-అశోక్‌రావు ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపట్టారు. కార్యక్రమంలో అధికారులు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.