కలెక్టరేట్, జూన్ 9: ఎన్నికల సంఘం బోగస్ ఓటర్లకు చెక్ పెడుతున్నది. ఒక వ్యక్తికి రెండు, మూడు చోట్ల ఓటు హక్కు ఉంటే తొలగించి ఒకే చోట ఉండేలా ఎన్నికల సంఘం చర్యలు చేపడుతున్నది. జిల్లాలో బోగస్ ఓటర్లను గుర్తించి తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టగా శరవేగంగా కొనసాగుతున్నది. ఇందుకోసం ఫొటో సిమిలార్ ఎంట్రీస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తూ, ఓటరు జాబితాలో ఉన్న వారి ఫొటోల ఆధారంగా బోగస్ ఓటర్లను గుర్తిస్తున్నారు. వారి వివరాలతో కూడిన జాబితాను అనుసరించి క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు.
సదరు ఓటరు ప్రస్తుతం ఉన్న చిరునామాలో మాత్రమే ఓటు ఉంచి, మిగతావి తొలగిస్తున్నారు. పరిశీలనలో ఒకే రకమైన ఫొటో, పేరు, ఇంటి పేరు, తండ్రి పేరు, తదితర వివరాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చిరునామా వేర్వేరుగా ఉన్నా, ఒకే రకమైన వ్యక్తిగత సమాచారం ఉంటే బోగస్ ఓటరుగా నిర్ధారిస్తున్నారు. ఓటు హకు పొందే వ్యక్తి తన ఫొటోతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే క్రమంలో చిరునామా, వయసులో తేడాతో నమోదు చేస్తున్నారు. దీంతో దరఖాస్తుదారు ఎకడంటే అకడ రోజుల వ్యవధిలోనే ఓటు హకు వస్తున్నది. దీనిని యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారు. ఈ క్రమంలో బోగస్ ఓటర్ల తొలగింపుపై ఎన్నికల సంఘం దృష్టిసారించింది.
గత నెల నుంచి బోగస్ ఓటర్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభించింది. ఒకటి కంటే ఎకువ చోట్ల ఓటు హక్కు ఉన్న వారి వివరాలు గ్రామాలు, వార్డుల వారీగా సేకరిస్తున్నారు. కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చిన జాబితాలను తహసీల్ కార్యాలయాల్లో, బూత్ లెవెల్ ఆఫీసర్లు పరిశీలిస్తున్నారు. ఓటరు ఎకడ నివాసం ఉంటే అకడే ఓటు హక్కు ఉండేలా ఎన్నికల సంఘం విడుదల చేసిన ఆదేశాలు అమలు చేస్తున్నారు. దీంతో జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 69,078 బోగస్ ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 67,707 ఓటర్ల వివరాలు ఇప్పటి వరకు బూత్ స్థాయిలో పరిశీలించారు.
ఇందులో 32,312 వాస్తవమైనవిగా, మిగతా 34,962 బోగస్ ఓటర్లుగా బీఎల్వోలు గుర్తించారు. ఓటరు జాబితాల్లోంచి 31,698 మంది పేర్లు తొలగించేందుకు అధికారులకు సిఫారసు చేయగా, 17,795 ఓటర్లను తొలగించినట్లు జిల్లా ఎన్నికల అధికారులు పేరొంటున్నారు. మిగతా బోగస్ ఓటర్లను కూడా తొలగించనున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలోని చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో వంద శాతం ఓటరు జాబితాల పరిశీలన పూర్తయింది. కరీంనగర్లో మాత్రం 96.91 శాతం పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.
జిల్లాలో 98 శాతంపైగా ఏరివేత
జిల్లాలో బోగస్ ఓట్ల ఏరివేత ప్రక్రియ ఇప్పటి వరకు 98 శాతానికి పైగా పూర్తయింది. ఎన్నికల సంఘం పంపిన జాబితా ద్వారా సిమిలార్ ఫొటో ఎంట్రీస్ వివరాల ఆధారంగా బీఎల్వోలు, వారి పోలింగ్ కేంద్రాల పరిధిలో ఇంటింటికీ వెళ్లి విచారణ జరుపుతున్నారు. గత నెల 15 నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. 34,962 బహుళ ఓట్లు ఉన్నట్లు గుర్తించాం. వీటిలో 17,795 ఓటర్ల పేర్లు ఇప్పటికే తొలగించినం. మిగతావి కూడా తొలగించే ప్రక్రియ కొనసాగుతున్నది.
-ఆనంద్‌కుమార్, ఆర్డీవో