కరీంనగర్, జూన్7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కరీంనగర్ రూరల్ : మృగశిర కార్తె వచ్చేసింది. మొదటి రోజు చేపల కూర తినాలనే ఆచారం అనాదిగా వస్తున్నది. దీని వెనుక ఆరోగ్య రహస్యం దాగున్నది. అందుకే ఎప్పుడూ తినని వారు సైతం ఒకటో, రెండో ముక్కలు తినడం కనిపిస్తుంది. కార్తె ప్రవేశం రోజు చేపలకు ఫుల్ గిరాకీ ఉంటుంది. దీంతోపాటు రేటు కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు మత్స్యకారులు బయటి ప్రాంతాల నుంచి తెచ్చి విక్రయించే వారు. అయితే, గత కొన్నేళ్లుగా రాష్ట్ర సర్కారు చేపట్టిన ‘నీలి విప్లవం’తో చెరువులు, ప్రాజెక్టుల్లో చేపల పంట పండుతుండగా, డిమాండ్‌కు తగినట్లు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కార్తె ప్రారంభం రోజు సాధారణ రోజుల కంటే ఎక్కువ ధరలకు అమ్ముతారు. బొమ్మె అయితే 600 నుంచి 800 దాకా, రవ్వు, బొచ్చె, బంగారుతీగ రకాలు 150 నుంచి 200లకుపైగా, చిన్న జెల్లలు 500లకుపైనే విక్రయిస్తున్నారు.
వ్యాధుల నియంత్రణకు చేపలు..
మృగశిర కార్తెలో చేపలను ఎందుకు తింటారో తెలుసా..? రోకండ్లను సైతం పగుల గొట్టే ఎండలు వెళ్లిపోయాయి. వానలతో పాటు చల్లని, చక్కని వాతావరణాన్ని మృగశిర కార్తె మోసుకొస్తుంది. 15 రోజుల పాటు ఈ కార్తె ఉంటుంది. మృగశిర ప్రారంభంలో చేపలు తినడాన్ని మన పూర్వీకుల నుంచి పాటిస్తున్నాం. ఎండకాలం తర్వాత వాతావరణం చల్లబడడంతో మన శరీరంలోనూ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ క్రమంలో వేడి ఉండేందుకు చేపలను తింటారు. తద్వారా గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. ఇదేగాక ఈ సీజన్లో చాలా మందికి జీర్ణశక్తితోపాటు రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. జ్వరం, దగ్గు బారిన పడుతారు. అలా కాకుండా ఉండాలంటే.. చేపలను తినాల్సిందే. ఈ కార్తెలో పూర్వీకులు శాకాహారులైతే ఇంగువను బెల్లంలో కలుపుకుని గోలీలాగా తయారు చేసుకొని తినేవారు. మాంసాహారులైతే చేపలను ఇంగువ, చింత చిగురుతో కలుపుకొని తినేవారు.
గుండెకు ఎంతో మేలు..
రెగ్యులర్‌గా చేపలు తినడం వల్ల విటమిన్ డీతోపాటు ఒమేగా 3 ఆమ్లాలు ఎక్కవగా లభిస్తాయి. ఇవి అనేక వ్యాధులను నియంత్రించడంలో ఎంతగానో సహాయపడుతాయి. ఒమేగా-3 ఆమ్లాలు కంటిచూపును, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గుండె సంరక్షణకు తోడ్పడుతాయి. ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును, అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇటీవలి కాలంలో హార్ట్ స్ట్రోక్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తరచుగా చేపలను తీసుకోవడం వల్ల గుండె సంబంధింత వ్యాధుల ముప్పును తగ్గించుకునే అవకాశముంటుంది. స్థానికంగా దొరికే నాణ్యమైన పెద్ద చేపలను ఇంగువ, చింత చిగురుతో కలిపి వండుకుని తినడం చాలా మంచిదని పలువురు వైద్యులు సూచిస్తున్నారు.
మృగశిర అంటే..
అశ్విని మొదలుకుని రేవతి వరకు మనకున్న 27 నక్షత్రాల్లో సూర్యుడి ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుంది. భారతీయ జ్యోతిష్య సంప్రదాయం ప్రకారం ఒక్కో కార్తెలో ఒక్కోవిధంగా ప్రకృతిలో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించిన నాటి నుంచి నైరుతి రుతుపవనాలు వస్తాయి. దీంతో వాతావారణం ఒక్కసారిగా చల్లబడడం.. ప్రకృతిలో పలు మార్పులు జరిగే నేపథ్యంలో అనేక రకాల చెడు సూక్ష్మక్రిములు, క్రిమి కీటకాలు పునరుత్పత్తి అవుతాయి. మానవుల్లో రోగ నిరోధకశక్తి తగ్గి జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత వ్యాధులు సర్వసాధారణం.
చేపల్లో ఏ, డీ విటమిన్లు
చేపలు తినడం వల్ల విటమిన్ ఏ తేలిగ్గా అందుతుంది. ఇది కంటి చూపునకు దోహపడుతుంది. చేపల కాలేయంలో ఉండే విటమిన్ డీ ఎముకల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఆహారంలో ఉన్న కాల్షియాన్ని స్వీకరించడానికి, ఆహారంలో శక్తి వినియోగానికి డీ విటమిన్ ఎంతో అవసరం. తాజా చేపల్ని తిన్నప్పుడు విటమిన్ సీ కూడా అందుతుంది. చిన్న చేపల్ని ముల్లుతోసహా తిన్నప్పుడు కాల్షియం, భాస్వరం, ఐరన్ అధికంగా లభిస్తాయి. కానీ ముల్లు తీసేసి తింటే ఇవి తక్కువగా లభిస్తాయి. ఏరకంగా చూసినా చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
– జీ రాజనర్సయ్య,కరీంనగర్ జిల్లా మత్స్య శాఖ అధికారి
పుష్కలమైనపోషకాలు