పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా జోరుగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఐదో రోజు మంగళవారం వార్డుల్లో పర్యటించిన ప్రజాప్రతినిధులు, ప్రత్యేకాధికారులు, హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ చర్యలతో పాటు పారిశుధ్య పనులను పరిశీలించారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.
హుజూరాబాద్ పట్టణంలో..
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక పలు వార్డుల్లో పర్యటించారు. పలుచోట్ల హరితహారం మొకల చుట్టూ ట్రీగార్డులు పెట్టించి, నీళ్లు పోశారు. వాటి సంరక్షణ బాధ్యతలు స్థానికులకు అప్పగించారు. అలాగే పారిశుధ్య పనులను పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, ఇన్చార్జి మున్సిపల్ ఇంజినీర్ జీ సాంబరాజు, టౌన్ ప్లానింగ్ అధికారులు జ్యోత్స్న, అశ్వినిగాంధీ, శానిటరీ ఇన్స్పెక్టర్ పీ అనిల్‌కుమార్, వార్డు ప్రత్యేకాధికారులు, కౌన్సిలర్లు, మెప్మా సిబ్బంది, ఆశ కార్యకర్తలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇల్లందకుంట మండలంలో..
మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లెప్రగతిలో భాగంగా ఐదో రోజు పారిశుధ్య, ప్లాంటేషన్ పనులను చేపట్టారు. ప్రత్యేకాధికారులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు పనులను పర్యవేక్షించారు. ఎంపీవో వెంకటేశ్వర్లు గడ్డివాణిపల్లిలో నిర్వహిస్తున్న పల్లెప్రగతి పనులను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారులు డీటీ రాజేశ్వరి, ఎంపీవో వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శులు కిషన్, కొండల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, స్వప్న, సంధ్యారాణి, అంకూస్, రాజేశ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సైదాపూర్ మండలంలో..
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో నర్సరీలను ఎంపీడీవో పద్మావతి పరిశీలించారు. మొక్కల సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పల్లె ప్రగతిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఎక్లాస్‌పూర్‌లో సర్పంచ్ కొత్త రాజిరెడ్డి నర్సరీని సందర్శించారు. నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
వీణవంక మండలంలో..
మండలంలోని వివిధ గ్రామాల్లో పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను ఎంపీడీవో శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అవెన్యూ ప్లాంటేషన్, పల్లెప్రకృతి వనం, ఇతర ప్లాంటేషన్లలో చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటాలని సూచించారు. నర్సరీల్లో కలుపు మొక్కలు తొలగించాలని, కొత్త మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో ప్రభాకర్, ఏవో గణేశ్, పంచాయతీ కార్యదర్శులు శ్రీధర్, సందీప్, శ్రీనివాస్‌రెడ్డి, అంజిరెడ్డి, హరీశ్, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.
జమ్మికుంట మండలంలో..
మండలంలోని అంకుషాపూర్‌లో నర్సరీ, ప్లాంటేషన్‌ను మండల ప్రత్యేకాధికారి సుమన్ ఎంపీవో సతీశ్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. గ్రామ ప్రత్యేకాధికారి పశువైద్యుడు పవన్ మజుందార్‌ను పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేకాధికారి మాట్లాడుతూ.. పల్లె ప్రగతి పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రణాళికాబద్ధంగా పనులను పూర్తి చేయాలని సూచించారు. కాగా, మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లెప్రగతి పనులను గ్రామ ప్రత్యేకాధికారులు ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులతో కలిసి పరిశీలించారు. ఇక్కడ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు.