కలెక్టరేట్, జూన్ 7: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో దేశానికి ప్రమాదమని, వారి పాలన ప్రజాస్వామ్యానికి పెను ముప్పుగా మారుతున్నదని ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తి, పౌరుల హకు, భావ స్వేచ్ఛను కాల రాస్తున్నదని ధ్వజమెత్తారు. కేవలం వారి స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేస్తూ ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ సర్కారు, రాష్ట్రంలోని ఆ పార్టీ నాయకులు అనుసరిస్తున్న మతతత్వ ప్రేరేపిత వ్యాఖ్యలు, ప్రసంగాలను నిరసిస్తూ ఈ నెల 11న నగరంలో బీజేపీయేతర పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి సంయుక్తంగా నిర్వహించే ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీ సన్నాహక సమావేశాన్ని మంగళవారం ఎంఐఎం కార్యాలయంలో నిర్వహించగా, ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడారు. సెక్యులర్ దేశమైన భారత్లో రాజ్యాంగాన్ని ఒక వర్గానికి, మతానికి అనుకూలంగా ఆపాదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ పాలనలో సుప్రీంకోర్టు తీర్పులను, ఆదేశాలను సైతం ధికరించే దుస్థితి నెలకొందని మండిపడ్డారు. నోట్ల రద్దు, జీఎస్టీ, కరోనా లాక్డౌన్ కారణంగా దేశ ప్రజల నడ్డి విరిగిందని, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. వేలాది మంది అప్పుల ఊబిలో చికుకొని, ఉద్యోగాలు కోల్పోయి, ఆర్థికంగా చితికిపోయి విలవిల్లాడుతున్నారని, ఇది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏడేండ్లలో సాధించిన ఘనత అంటూ ఎద్దేవా చేశారు. జీడీపీ అమలు, రాజ్యాంగ హకులు కాలరాయడంతో ప్రపంచంలో భారత్ స్థానం 90కి పడిపోయిందని, చిన్న దేశమైన బంగ్లాదేశ్ కంటే హీనంగా దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. దేశంలో దళితులు, ముస్లింలను రెండో శ్రేణి పౌరులుగా పరిగణించే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. దేశాన్ని ఒక మతం, వర్గానికి సంబంధించిన రాజ్యంగా మార్చే ప్రయత్నం జరుగుతున్నదని, ప్రజలు గుర్తించాలని సూచించారు. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు బండి సంజయ్, రాజాసింగ్, అర్వింద్ ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. ప్రపంచంలో భారత దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఆదర్శవంతమైందని, అటువంటి అఖిల భారతావనిలో సెక్యులరిజాన్ని కాపాడే దిశగా అన్ని వర్గాల ప్రజలు కలిసి కట్టుగా ముందుకు రావాలని కోరారు. బీజేపీకి వ్యతిరేకంగా కరీంనగర్లో నిర్వహించే ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొని కబోదుల్లా మాట్లాడుతున్న బీజేపీ నేతల కండ్లు తెరిపించాలని పిలుపునిచ్చారు.