చొప్పదండి, జూన్ 7: పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు భాగస్వాములు కావాలని ఎంపీపీ చిలుక రవీందర్ పిలుపునిచ్చారు. మండలంలోని పెద్దకుర్మపల్లి గ్రామంలో పల్లెప్రగతి పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. గ్రామంలో కొవిడ్ వ్యాక్సినేషన్, పారిశుధ్య పనులు, హరితహారం, నర్సరీ, వైకుంఠధామం, క్రీడా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, మండలంలో పల్లెప్రగతి పనులు విజయవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గ్రామాల్లో సమస్యలను గుర్తించి, త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ తొట్ల గంగమల్లయ్య, ఎంపీడీవో స్వరూప, పంచాయతీ కార్యదర్శి పద్మలత, ప్రత్యేకాధికారి పరశురాం పాల్గొన్నారు.
పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దు
చొప్పదండి పట్టణంలో జరుగుతున్న పట్టణ ప్రగతి పనులను ప్రత్యేకాధికారి మైఖేల్ పరిశీలించారు. చేపడుతున్న పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు విన్నవించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. అనంతరం 13వ వార్డు పరిధిలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి-సాంబయ్య, కౌన్సిలర్ కొత్తూరి మహేశ్, పట్టణ ప్రగతి ప్రత్యేకాధికారి రాంబాబు, మేనేజర్ ప్రశాంత్, టౌన్‌ప్లానింగ్ అధికారులు నస్రీన్ భాను, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
గంగాధర, జూన్ 7: మండలంలోని ఆయా గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమం మంగళవారం ఐదో రోజు కొనసాగింది. అవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనం, హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించి చనిపోయిన వాటి స్థానంలో కొత్తవి నాటారు. మొక్కల చుట్టూ పెరిగిన గడ్డి, చెత్తను తొలగించి నీరు పోయడానికి అనువుగా గుంతలు తీశారు. నర్సరీలను సందర్శించి మొక్కల మధ్యలో పెరిగిన కలుపు మొక్కలను కూలీలతో తొలగించారు. గ్రామ పంచాయతీల పరిధిలో మొక్కలు నాటడానికి స్థలాలను గుర్తించాలని నిర్ణయించారు. ఇంటింటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలని గ్రామస్తులకు సూచించారు. గ్రామంలో 40 ఏళ్లు దాటిన వారికి వైద్య పరీక్షలు చేసి, మందులు అందజేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి
రామడుగు, జూన్ 7: పల్లెప్రగతిలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ కంటికి రెప్పలా కాపాడాలని ఎంపీపీ కలిగేటి కవిత కోరారు. రామడుగు మండలం రుద్రారం, రంగశాయిపల్లి గ్రామాల్లో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంలో ఆమె స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఇందులో భాగంగా రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలకు నీళ్లు పట్టారు. వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, హరితహారంలో నాటిన మొక్కలతో అడవుల శాతం పెరిగిందన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. కాగా, వెలిచాలలో పల్లె ప్రకృతి వనాలు, నర్సరీని సర్పంచ్ వీర్ల సరోజన సందర్శించారు. ఈ కార్యక్రమాల్లో మండల ప్రత్యేకాధికారి ప్రియదర్శిని, ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, ఎంపీవో సురేందర్, ఏపీవో రాధ, సర్పంచులు వొంటెల అమరేందర్‌రెడ్డి, సాదు పద్మ, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు వీర్ల సంజీవరావు, పీఆర్ ఏఈ సచిన్, పంచాయతీ కార్యదర్శులు విజయ, సారిక, మధునయ్య, మాజీ సర్పంచ్ వీర్ల రవీందర్రావు, టీఆర్ఎస్ నాయకులు కలిగేటి లక్ష్మణ్, సాదు మునీందర్‌రెడ్డి, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.