వెల్గటూర్, జూన్ 7 : మహిళా సంఘాలు నాణ్యమైన సహజ ఉత్పత్తులను తయారుచేసి ఆర్థికాభివృద్ధిని సాధించాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆకాంక్షించారు. మండలంలోని రాజారాంపల్లిలోని ఎస్ఆర్ గార్డెన్స్‌లో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని మహిళా గ్రూప్ సభ్యులకు డీఆర్డీఏ సెర్ప్ ఆధ్వర్యంలో సహజ ఉత్పత్తుల తయారీపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై మాట్లాడారు. ప్రతి మహిళలనూ ఆర్థికంగా నిలబెట్టాలనే లక్ష్యంతో 14 నెలలుగా నుంచి జిల్లా స్థాయి అధికారులతో కసరత్తు చేసి ‘సహజ ’ ప్రొడక్ట్స్ అనే ఒక ఫ్లాట్ ఫాంను తయారు చేశామన్నారు. మహిళలు తయారుచేసిన 33 రకాల ఉత్పత్తులను సహజ ప్రొడక్ట్స్ పేరుతో సెర్ప్-డీఆర్డీఏ ద్వారా విక్రయిస్తూ లాభాలు పొందుతున్నారని పేర్కొన్నారు. సహజ ప్రొడక్ట్స్ అంటే నాణ్యతకు మారుపేరుగా నిలిపి కొద్దికాలంలోనే మరిన్ని ఉత్పత్తులను సహజ కిందకు తీసుకువచ్చి, ప్రభుత్వం ద్వారా బ్యాంక్ లింకేజీ రుణాలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి సహకరిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
త్వరలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇతర శాఖల అధికారులతో సమావేశమై సహజ ఉత్పత్తుల గురించి చర్చించి, ఈ కార్యక్రమా న్ని ముఖ్యమంత్రి సహకారంతో రాష్ట్ర వ్యాప్తం చేసేలా ప్రణాళికలు తయారు చేస్తామని పేర్కొన్నారు. మొదట ధర్మపురి నియోజకవర్గ మహిళలు నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేసి, మంచి లాభాలు పొంది రాష్ర్టానికి ఆదర్శంగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో వెల్గటూర్, ధర్మారం ఎంపీపీలు కునమల్ల లక్ష్మి, ముత్యాల కరుణశ్రీ బలరాంరెడ్డి, వైస్‌ఎంపీపీ ముస్కు కవితాదేవేందర్రెడ్డి, డీఆర్డీఏ పీడీ వినోద్, ఏఎంసీ చైర్మన్ పత్తిపాక వెంకటేశ్, జడ్పీటీసీ సుధారాణి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గెల్లు చంద్రశేఖర్, తహసీల్దార్ ఉయ్యాల రమేశ్, ఎంపీడీవో ఆకుల సంజీవరావు, ఏపీఎం చంద్రకళ, ఐకేపీ సిబ్బంది, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.