ఎనకట ఎండకాలంల చెరువులు ఎట్లుండె.. దాహం కోసం నోరు తెరచిన ఎడారిలా ఉంటుండె.. ఎక్కడపడితే అక్కడ పిచ్చి మొక్కలు.. ముళ్ల పొదలు.. అక్కడక్కడా నీటి కుంటలు.. వాటిలోని మురికి నీటిని తాగలేక మూగ జీవాల తిప్పలు.. చెరువు గట్టుపైన ఈ సారైనా ‘కాలం వస్తుందా..?’ అని ఆకాశం వంక చూసే రైతు.. అయితే.. ఇది ఒకప్పుడు..! స్వరాష్ట్రం వచ్చిన తర్వాత చెరువులకు పూర్వ వైభవం వచ్చింది.. ‘మిషన్ భగీరథ’తో చెరువులు పటిష్టమయ్యాయి.. ‘జల’పుష్పాలకు ఆలవాలమయ్యాయి.. మత్స్యకారులకు ఏడదంతా ఉపాధినిస్తున్నాయి.. నిండు వేసవిలోనూ చెరువులు జల సిరులను నింపుకున్నాయి.. తద్వారా భూగర్భజలాలు పెరిగాయి.. పంటలకు సాగుజలాలు ధార కట్టాయి..
కూసుమంచి, జూన్ 5: ‘పల్లె పల్లెనా పల్లేర్లు మొలిచే నా తెలంగాణలోనా..’ అన్నాడు ఓ వాగ్గేయకారుడు. అవును.. ఉమ్మడి పాలనలో పరిస్థితి ఇదే. నాటి ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పక్కన పెట్టేశాయి. చెరువుల్లో పూడిక నిండి ఉండేది. పునరుద్ధరణ ఊసే ఉండేది కాదు. గొలుసు కట్టు చెరువులు సాగుకు ప్రాణం. వాటి సంగతీ పట్టించుకునేవి కావు నాటి ప్రభుత్వాలు. దీంతో ఆయకట్టంతా నెర్రెలు బారేది. బావుల్లో ఊట లేక రైతన్న సాగు చేసేందుకు ఇబ్బంది పడేవాడు. కూలీలకు ఉపాధి లేక వలస బాట పట్టేవారు. సొంతూళ్లను వదిలి పరాయి ప్రదేశానికి తరలివెళ్లేవారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ‘మిషన్ కాకతీయ’ అమలు చేశారు. చెరవుల పునరుద్ధరణ చేపట్టి రైతులకు అండగా నిలిచారు. చెరువు కట్టలను పటిష్టం చేశారు. పూడిక తీయించారు. తద్వారా చెరువులు బలోపేతమయ్యాయి. పంటలకు 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతున్నది. దీంతో రైతుల కష్టాలు తీరాయి. రైతులు దర్జాగా వ్యవసాయం చేసుకుంటున్నారు.
పెరిగిన భూగర్భజలాలు..
ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రంలో అత్యంత కరువు మండలాల్లో కూసుమంచి మండలమూ ఉండేది. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో జల సిరులు పొంగాయి. మిషన్ భగీరథతో పాటు భక్తరామదాసు ఎత్తిపోతలతో పంట భూములు సస్యశ్యామలమయ్యాయి. చెరువులు జలకళను సంతరించుకున్నాయి. భూగర్భజలాలు పెరిగాయి. గతంలో ఈ ప్రాంతంలో 200 అడుగులకు పైగా బోరు వేసినా నీరు పడేది కాదు. భూగర్భజలాలు పైకి చేరుకోవడంతో ఇప్పుడు కేవలం 30- 40 అడుగులలోపే బోరు పడుతున్నది. ఇక వానకాలంలో భూమి లెవల్‌కు బావుల్లో నీరు కనిపిసున్నది. చెరువులన్నీ మత్తడిపోస్తున్నాయి.
మత్స్యకారులకు ఉపాధి..
చెరువుల పునరుద్ధరణతో మత్స్యకారులకూ మంచిరోజులు వచ్చాయి. మత్స్యకార సంఘాలూ బలోపేతమవుతున్నాయి. వారికి ప్రభుత్వం అండగా నిలిచి 100శాతం రాయితీపై చేపపిల్లలు పంపిణీ చేస్తున్నది. జిల్లాలో పాలేరు, వైరా, లంకాసాగర్ పెద్ద జలాశయాలు, 1,210 చిన్న చెరువులు ఉన్నాయి. మత్స్యకారులు చెరువుల్లో వాటి సామర్థ్యాన్ని బట్టి 100శాతం రాయితీపై చేపపిల్లలు విడుదల చేస్తున్నది. గతేడాది రూ.6.45 కోట్ల విలువైన 4,04,94,440 చేప పిల్లలను ఉచితంగా మత్స్యకారులకు అందజేసింది. జిల్లావ్యాప్తంగా 144 ప్రాథమిక సంఘాలు, 30 మహిళా సంఘాలు, ఆరు హరిజన సంఘాలు, ఆరు గిరిజన సంఘాలు ఉండగా వీటి పరిధిలో 14,500 మంది సభ్యులు ఉన్నారు. వీరందరికీ ఇప్పుడు ఉపాధి దొరుకుతున్నది. చేపలు మార్కెటింగ్ చేసుకునేందుకు రాయితీపై వలలు, వాహనాలూ అందించడంతో మత్స్యకారులకు మేలు జరుగుతున్నది.
మత్స్యకారులకు మంచిరోజులు..
కొన్నేళ్ల క్రితం వేసవిలో చెరువులు ఎండిపోయేవి. ఈ కారణంగా పంటల సాగూ ఉండేది కాదు. దీంతో కూలీలకు ఉపాధి దొరికేది కాదు. ఇప్పుడు నిండు వేసవిలోనూ చెరువులు జలకళను సంతరించుకున్నాయి. మత్స్యకారులు చేపల పెంపకం చేపడుతున్నారు. చేపలు పట్టి ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వం చేపలను వందశాతం రాయితీపై ఇస్తున్నది. వీలైనప్పుడల్లా కూలి పనులకు వెళ్తున్నాం.
– పిట్టల వెంకటేశ్వర్లు, మత్స్యకారుడు, కూసుమంచి
చెరువుల్లోంచి నడిచి వెళ్లే వాళ్లం..
గతంలో వానకాలంలోనూ చెరువులు నిండేవి కావు. అరకొరగా చెరువుల్లో నీరు నిలిచేది. పశువులకు తాగునీరు కూడా దొరికేది కాదు. రైతులంతా పొలాలకు వెళ్లేందుకు చెరువులో నుంచే నడిచి వెళ్లేవారు. చెరువుల్లో మోకాళ్ల నీరు ఉంటే అదే ఎక్కువ. ఇప్పుడా పరిస్థితి లేదు. మిషన్ కాకతీయతో చెరువులు బాగుపడ్డాయి. పంటలకు పుష్కలంగా సాగునీరు అందుతున్నది. వానకాలంలో చెరువులన్నీ అలుగుపోస్తున్నాయి.
– వాసంశెట్టి వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ చైర్మన్, రాజుపేట
ఎవుసం బాగుంది..
ఉమ్మడి పాలనలో విద్యుత్ సరఫరా ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు ఉండదో తెలిసేది కాదు. కరెంట్ కోసం రాత్రిళ్లు పొలాల వద్దే కావలి కాయాల్సి వచ్చేది. ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోతే పట్టించుకునే నాథుడే లేకపోయేవారు. నెలల తరబడి సాగునీటికి ఇబ్బంది పడేవాళ్లం. కొన్నిసార్లు ఆయిల్ ఇంజిన్లపై ఆధారపడాల్సి వచ్చేది. త్రీఫేజ్ విద్యుత్ సరఫరా లేక ఎకరా పంట తడవడానికి రెండు, మూడు రోజులు పట్టేది. ఇప్పుడా కష్టం లేదు. సీఎం కేసీఆర్ పంటలకు 24 గంటల పాటు ఉచితంగా పంటలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయిస్తున్నారు.
– ఆడెపు నగేశ్, రైతు, కూసుమంచి
చెరువుల్లో పుష్కలంగా నీరు..
గతంలో వేసవిలో వస్తే బావులు, చెరువులు, బోర్లలో నీరు ఉండకపోయేది. మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పునరుద్ధరణ చేపట్టడంతో భూగర్భజలాలు అమాంతం పెరిగాయి. ఇప్పుడు నిండు వేసవిలోనూ తాగు, సాగునీటి ఇబ్బందులు తప్పాయి. గతంలో బోరు వేయాలంటే 200 అడుగుల పైన వేయాల్సి వచ్చేది. ఇప్పుడు 50 అడుగుల లోపే నీరు పడుతున్నది. ఇక వానకాలంలో అయితే భూమి లెవల్‌కు నీరు చేరుకుంటున్నది.
– నెల్లూరి లీలా ప్రసాద్, సీడీసీ చైర్మన్