అశ్వారావుపేట, జూన్ 5 : గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ పాలకవర్గాల పాత్ర ప్రధానం. గ్రామాల్లో సమస్యలకు సత్వర పరిష్కారంతోపాటు అభివృద్ధిని వేగవంతం చేయడంలో పాలకవర్గాలే కీలకం. అభివృద్ధికి అవసరమైన నిధులను స్థానిక వనరుల ద్వారా సమకూర్చుకోవడంతో అభివృద్ధిని పరుగులు పెట్టించవచ్చు. ప్రభుత్వం విడుదల చేసే నిధులకుతోడు స్థానిక వనరుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడం మరింత అభివృద్ధి సాధించేందుకు తోడ్పాటునిస్తుంది. గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం కల్పించిన విధులు, హక్కులను పటిష్ఠంగా అమలు చేయడం వల్ల స్థానిక వనరులతో ఆదాయాన్ని పొందవచ్చు. గ్రామ పంచాయతీలకు ఇంటి, నీటి పన్నులు మాత్రమే ఆదాయ వనరులు కావు. వీటితోపాటు సంత మార్కెట్ నిర్వాహణ, ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు, మైనింగ్ నుంచి సీనరేజీ, చేపల చెరువుల వేలం ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు. పంచాయతీల పాలకవర్గాలు, అధికార యంత్రాంగం సమష్టిగా పని చేస్తే స్థానిక వనరుల నుంచి ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు.
సర్పంచుల సమన్వయంతో ఆదాయ సమీకరణ
గ్రామాల్లో ఉండే స్థానిక వనరుల ద్వారా ఆదాయాన్ని సమీకరించుకునేందుకు సర్పంచులు, గ్రామ కార్యదర్శులతో సమన్వయం చేసుకుని పనిచేస్తే సత్ఫలితాలు అందుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవడం సులభమవుతోంది. ప్రభుత్వం విడుదల చేసే సాధారణ నిధులకు స్థానిక వనరుల నుంచి సమకూర్చుకున్న ఆదాయంతో గ్రామాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించొచ్చు.
ఇళ్ల నిర్మాణాలు..
ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం ద్వారానూ ఆదాయం సమకూర్చుకోవచ్చు. ఇంటి వైశాల్యం బట్టి ఆదాయం పొందవచ్చు. ఇళ్ల లే అవుట్ల నుంచి ఆదాయం లభిస్తుంది. అలాగే వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకోవడంలో ల్యాండ్ కన్వర్షన్తో కూడా ఆదాయం పొందవచ్చు.
సీనరేజీతోనూ ఆదాయం
గ్రామాల్లో మట్టి, రాయి క్వారీలకు అనుమతులు ఇవ్వడం ద్వారా సంబంధితశాఖతో పాటు గ్రామ పంచాయతీలకు ఆదాయం లభిస్తుంది. సీనరేజీ ద్వారా సమకూర్చుకునే ఆదాయాన్ని గ్రామాల అభివృద్ధికి ఎంతో దోహదపడతాయి. ప్రభుత్వం విడుదల చేసే సాధారణ నిధులకు స్థానిక వనరుల ద్వారా సమకూర్చుకునే ఆదాయంతో అభివృద్ధిని వేగవంతం చేసుకోవచ్చు.
సాధారణ నిధులు
గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తుంటుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ కేటాయించే నిధులు గ్రామ పంచాయతీ అభివృద్ధికి దోహదపడతాయి. గ్రామ పంచాయతీల్లో జనాభా ప్రాతిపదికన ఆదాయ, వ్యయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంది. సర్పంచులు పాలకవర్గాల తీర్మానంతో నిధులను అభివృద్ధి పనులకే వెచ్చిస్తుంటారు.
టీఎఫ్సీ ఫండ్
గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా టీఎఫ్సీ(టెన్త్ ఫైనాన్స్ కమిషన్) నిధులను మంజూరు చేస్తుంది. టీఎఫ్సీలో భాగంగా 14వ ఆర్థిక కమిషన్ అమల్లో ఉంది. ఈ నిధులతో గ్రామ పంచాయతీ పాలకవర్గాలు వివిధ అభివృద్ధి పనులు చేపడతాయి.
సాధారణ ఫండ్
గ్రామ పంచాయతీలకు జనరల్ ఫండ్ అందుబాటులో ఉంటుంది. గ్రామ పంచాయతీలకు లభించే ఇంటి, నీటి, వ్యాపార పన్నులు ద్వారా వసూలు చేసిన రుసుమును సాధారణ నిధులకు సంబంధించిన ఖాతాలో జమ చేస్తాయి. జిల్లా పంచాయతీ అధికారి అనుమతితో మంజూరైన సాధారణ నిధులను గ్రామ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సర్పంచులు ఖర్చు చేస్తుంటారు.
సంత మార్కెట్ల నుంచి..
స్థానిక వనరులను సద్వినియోగం చేసుకోవడంలో ప్రధానంగా గ్రామాల్లో సంత మార్కెట్ల నిర్వహణ ముఖ్యమైనది. గ్రామీణ ప్రజలకు నిత్యవసర సరుకులు, ఇతర వస్తువులను అందుబాటులో ఉంచే విధంగా వారంతపు సంత మార్కెట్లను ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలు ఆదాయం పొందవచ్చు. పశువులు, గొర్రెల విక్రయాలకు అనుమతినిస్తూ ఆదాయం సమీకరించుకోవచ్చు.
చెరువుల ద్వారా..
గ్రామాల్లో ఉండే చెరువుల ద్వారా కూడా ఆదాయం సమకూర్చుకోవచ్చు. చెరువుల్లో చేపలు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చి ఆదాయం పొందవచ్చు. నిరుపయోగంగా ఉన్న చెరువులను గ్రామీణ ఉపాధిహామీ పథకంలో అభివృద్ధి చేసి నీటిని నిల్వ చేసి ఆదాయ వనరుగా మలుచుకోవటానికి వీలు ఉంటుంది.
స్థానిక వనరుల ద్వారా ఆదాయం
గ్రామ పంచాయతీల పరిధిలో స్థానిక వనరుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాం. వీటిని పంచాయతీ అభివృద్ధికి వెచ్చిస్తున్నాం. దీనితోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విడుదలయ్యే నిధులనూ అభివృద్ధికి వినియోగిస్తున్నాము. ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులకు తోడు పంచాయతీల్లో స్థానిక వనరుల నుంచి సమకూర్చుకునే ఆదాయం అభివృద్ధిని వేగవంతం చేసేందుకు దోహదపడుతున్నాయి. సంత వేలం, నీటి పన్ను, ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు వంటి అనేక స్థానిక వనరుల ద్వారా ఆదాయం సమకూర్చుకుంటున్నాం.
– హరికృష్ణ, గ్రామ పంచాయతీ ఈవో, అశ్వారావుపేట