చొప్పదండి, జూన్ 4: గ్రామాలాభివృద్ధిలో సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులతోపాటు ప్రజలంతా భాగస్వాములు కావాలని జడ్పీటీసీ మాచర్ల సౌజన్య-వినయ్ పిలుపునిచ్చారు. పల్లెప్రగతిలో భాగంగా మండలంలోని భూపాలపట్నం గ్రామంలో ఇంకుడుగుంతలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ.. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ తమవంతు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. గామాలాభివృద్ధితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించిన సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా పల్లెప్రగతిని నిర్వహిస్తున్నారని చెప్పారు.
కార్యక్రమంలో భాగంగా నిర్వహించే గ్రామసభల్లో గ్రామాభివృద్ధికి అవసరమయ్యే పనులను గుర్తిస్తున్నట్లు తెలిపారు. తద్వారా మంజూరైన నిధులతో అభివృద్ధి పనులు చేపట్టి సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దుతామన్నారు. మండలాన్ని ఆదర్శంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంకుడుగుంతల నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కిట్టుగౌడ్, ప్రత్యేకాధికారి నరోత్తమరెడ్డి, అంగన్వాడీ టీచర్ బైరగోని జమున, ఆశ కార్యకర్తలు పద్మ, భూలక్ష్మి, మహిళా సంఘం అధ్యక్షురాలు స్వప్న, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే మండలంలోని కాట్నపల్లి, కోనేరుపల్లి గ్రామాల్లో పల్లెప్రగతి పనులను ఎంపీపీ చిలుక రవీందర్ పరిశీలించారు.
గ్రామంలో సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, ప్రత్యేకాధికారులు సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. రోడ్లు, ఇంటిముందు చెత్తబుట్టలు ఏర్పాటు చేసి అందులో చెత్త వేయించాలని, రోడ్లపై చెత్తాచెదారం లేకుండా చూడాలన్నారు. డ్రైనేజీలను నిరంతరం శుభ్రం చేయించాలన్నారు. పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సర్పంచ్ లింగంపల్లి లావణ్య, కోలపూరి తులసమ్మ, ఎంపీటీసీ కట్టెకోల తార, ఎంపీడీవో స్వరూప, ఏపీవో రాజు, ఉపసర్పంచ్ ఇప్ప శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్ మండలంలో..
కరీంనగర్ రూరల్, జూన్ 4: పల్లె ప్రగతి కార్యక్రమం శనివారం రెండోరోజుకు చేరింది. బొమ్మకల్‌లో చేపట్టిన పారిశుధ్య పనులను గ్రామ ప్రత్యేకాధికారి రామకృష్ణ పరిశీలించారు. ఉపసర్పంచ్ మాచర్ల వెంకటేశ్వర్లు అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించి పలు పనులపై చర్చించారు. పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, సిబ్బంది, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. నగునూర్‌లో పంచాయతీ కార్యదర్శి మల్లయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా పలువురికి ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలని సూచించారు. గోపాల్పూర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సర్పంచ్ ఊరడి మంజుల, ఉపసర్పంచ్ ఆరె శ్రీకాంత్, వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ ఆధ్వర్యంలో బడి బాటలో భాగంగా ర్యాలీ తీశారు. బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపించాలని గ్రామస్తులకు సూచించారు. ప్రధానోపాధ్యాయుడు రవీందర్, మహిళా సంఘాల నాయకులు, వార్డు సభ్యులున్నారు.
గంగాధర మండలంలో..
గంగాధర, జూన్ 4: మండలంలోని వివిధ గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమం రెండోరోజు కొనసాగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంటింటికీ వెళ్లి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ప్లాస్టిక్ వినియోగంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించి తొలగించారు. మురుగు కాలువల చివర్లలో కమ్యూనిటీ ఇంకుడు గుంతలు నిర్మించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.