శంకరపట్నం, జూన్ 3: పల్లెప్రగతితో గ్రామాలు కొత్త రూపును సంతరించుకోనున్నాయని మండల ప్రత్యేకాధికారి ఎన్ అంజని పేర్కొన్నారు. ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా తొలి రోజు శుక్రవారం పాదయాత్రలు నిర్వహించి, ఆయా గ్రామాల సర్పంచుల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు. 15 రోజుల పాటు నిర్వహించనున్న పల్లె ప్రగతి ప్రణాళికలను రూపొందించారు. ఆదాయ వ్యయాలు, ఇప్పటి వరకు సాధించిన ఫలితాలను సభలో చదివి వినిపించారు. మండల ప్రత్యేకాధికారి అంబాల్‌పూర్, మక్త, కన్నాపూర్ గ్రామాలను సందర్శించి, పాదయాత్రలో పాల్గొన్నారు. మక్త గ్రామంలో వన నర్సరీని సందర్శించారు. కార్యక్రమంలో ఎంపీవో బషీరొద్దీన్, సర్పంచులు, ఆయా గ్రామాల ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
చిగురుమామిడిలో..
చిగురుమామిడి, జూన్ 3: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అన్ని గ్రామాల్లో నర్సరీలను పరిశీలించారు. ములనూర్లో మండల ప్రత్యేకాధికారి నతానియల్, చిగురుమామిడిలో ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి, గాగిరెడ్డిపల్లిలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వినయ్, సర్పంచ్ వెంకటేశం నర్సరీలను పరిశీలించారు.
తిమ్మాపూర్‌లో..
తిమ్మాపూర్ రూరల్, జూన్ 3: మండల వ్యాప్తంగా పల్లె ప్రగతి పనులను సర్పంచులు, కార్యదర్శులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వీధుల్లో ర్యాలీలు తీశారు. పల్లె ప్రగతిలో చేయాల్సిన పనుల గురించి వివరించారు. ఇక్కడ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు, పాలకవర్గ సభ్యులు ఉన్నారు.
మానకొండూర్‌లో..
మానకొండూర్ రూరల్, జూన్ 3: మండలంలోని ముంజంపల్లి, వెల్ది, వేగురుపల్లి, కొండపల్కల గ్రామాల్లో శుక్రవారం పల్లె ప్రగతి కార్యక్రమాలను ఆయా గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ముంజంపల్లిలో మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్లు హాజరై అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఇక్కడ సర్పంచ్ రామంచ గోపాల్‌రెడ్డి, ఉప సర్పంచ్ పిట్టల కుమార స్వామి, పంచాయతీ కార్యదర్శి శ్రావణి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.