కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 3: బుడిబుడి నడకలతో తడబడుతూ అ.. ఆ.. అనే బుడుతలు ఇక నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ఆడుతూ.. పాడుతూ.. నీతి కథలు వింటూ పాఠాలు నేర్చుకోబోతున్నారు. మూస విధానంతో కొనసాగే బోధనకు స్వస్తి పలుకుతూ, చిన్నారుల్లో ఆలోచనలు రేకెత్తిస్తూ, మేధోశక్తిని పెంచేందుకు ఆస్ట్రేలియా, అమెరికా, చైనా, హాంకాంగ్ తరహాలో ప్రీ స్కూల్ విద్యను అమలు చేయాలని రాష్ట్ర ప్ర భుత్వం నిర్ణయించింది. త్వరలోనే ప్రారంభించబోతుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
అధికారులకు శిక్షణ పూర్తి
ప్రీస్కూల్ అమలుకు కసరత్తు పూర్తి చేసిన రాష్ట్ర సర్కారు, ఇప్పటికే జిల్లా స్థాయిలో జిల్లా సంక్షేమాధికారులు, సీడీపీవోలు, ఏడీపీవోలకు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ కేంద్రంలో మొదటి విడుత శిక్షణ అందించింది. రెండో విడుతలో జిల్లా కేంద్రాల్లోని బాల మహిళా ప్రగతి ప్రాంగణాల్లో అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నది. నేటి పోటీ సమాజంలో నిలదొక్కుకోవాలంటే పునాది పటిష్టంగా ఉండాలి. చిన్నారులు వేసే మొదటి అడుగే బలంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం, అంగన్వాడీ కేంద్రాలను ప్రీ సూళ్లుగా మార్చి, పకడ్బందీగా పూర్వ ప్రాథమిక విద్యను అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది.
జిల్లాకు చేరిన పుస్తకాలు
బాల్యం ఆరంభ దశలో పిల్లల భవిష్యత్‌కు అవసరమైన కార్యక్రమాల వైపు దృష్టి మళ్లిస్తే, ఇక వారు జీవితంలో వెనుదిరిగే అవకాశాలుండవనేది రాష్ట్ర సర్కారు పెద్దల ఆలోచన. అభివృ ద్ధి చెందిన అనేక దేశాల్లో ఇదే విధానాన్ని పాటిస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు విద్యారంగ నిపుణులు కూడా ఆయా దేశాల్లో పర్యటించి, పూర్వ ప్రాథమిక విద్యపై అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. ఈ క్రమంలో ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాలను కూడా ముద్రించి, ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాలకు పంపించారు. కరీంనగర్ జిల్లాలోని నాలుగు ప్రాజెక్టుల పరిధిలో 777 కేంద్రాల్లో 30వేలకు పైగా చిన్నారులున్నారు. ఇందులో 3 నుంచి 6 ఏండ్ల మధ్య 6వేల మంది ఉన్నారు. అయితే మూడేండ్ల పిల్లలకు ఐదు రకాలు, 4 నుంచి ఐదేళ్ల పిల్లల కోసం ఆరు పుస్తకాలు రూపొందించారు. ఐసీడీఎస్ యంత్రాంగం అందించే సిలబస్ ప్రకారం పిల్లలకు బోధించేలా అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.
బోధన ఇలా..
చిన్నారుల ప్రతిభను కూడా అంచనా వేసేందుకు ఇప్పటికే ప్రీస్కూల్ అసెస్మెంట్ కార్డులు తయారు చేసి కేంద్రాలకు పంపారు. మూడేండ్ల పైబడ్డ వారికి ఆకుపచ్చ రంగు, నాలుగేండ్ల పైబడ్డవారికి నీలి రంగులో కార్డులు ఇచ్చారు. ఈ క్రమంలో నిత్యం గణితబోధన, తెలుగు అభ్యసన కర దీపిక, పరిసరాలపై అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా తయారు చేయించిన పుస్తకాలు, ఇంగ్లిష్ వర్క్ బుక్కుల్లో చుకలు కలుపుతూ బొమ్మలు గీయడం, వస్తువులు చూసి పేర్లు రాయడం, అక్షరాలు, అంకెలు క్రమం తప్పకుండా చదివించడం, తదితర పద్ధతుల్లో బోధన చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నెలనెలా పలు టెస్టుల ద్వారా నిర్ధారించి ఆకుపచ్చ, నీలిరంగు కార్డులో నమోదు చేసి తల్లిదండ్రులకు అందజేస్తారు. వెనుకబడిన వారిని గుర్తించి, వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వారిలో నెలకొన్న బుద్ధి మాంద్యత మూలంగా చిన్నారుల ఆరోగ్యంపై దృష్టి సారించి, వైద్యం అందించే అవకాశాలుంటాయి. ఇప్పటికే చిన్నారులకు పోషకాహారంతో పాటు బాలామృతం అందిస్తుండగా, వారిలోని ఆరోగ్య సమస్యలను గుర్తించేందుకు అవసరమైన చర్యలు కూడా చేపడుతున్నారు.
ప్రీస్కూల్ విద్యతో అనేక లాభాలు
అంగన్వాడీ కేంద్రాల్లో మూడు నుంచి ఐదేండ్లలోపు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, శిక్షణ ఇవ్వడం అభినందనీయం. ప్రీస్కూల్ విద్యతో చిన్నారులకు అనేక లాభాలున్నాయి. ముఖ్యంగా మూడు నుంచి ఆరేండ్లలోపు పిల్లల్లో మెదడు శరవేగంగా అభివృద్ధి చెందే దశలో, వారికి అవగాహనతో కూడిన విద్య అందించాలి. దీని ద్వారా భవిష్యత్‌లో వారికి ఎన్నో ప్రయోజనాలుంటాయి. మేధోశక్తి పెరుగుతుంది. ఇంట్లో ఉన్నట్లుగానే అనిపించేలా విద్యాబోధన సాగుతుంది. ఆట, పాటలతో విద్య నేర్పడం ద్వారా పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎంతగానో అభివృద్ధి చెందుతారు. వారిలో చిన్న కండరాలు, పెద్ద కండరాల అభివృద్ధి మూడు నుంచి ఐదేళ్లలోపు జరుగుతుంది. దీంతో వారు సొంతంగా అన్ని పనులు చేసుకోగలుగుతారు.
– ఉమారాణి, ఐసీడీఎస్ అర్బన్ సీడీపీవో