గన్నేరువరం, జూన్ 1: అణగారిన వర్గాల ఆశా జ్యోతి దళిత బంధు పథకం అని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండలంలోని పీచుపల్లి గ్రామానికి చెందిన దళిత బంధు పథకం లబ్ధిదారు జంగపెల్లి గ్రామంలో ఏర్పాటు చేసుకొన్న ఎలక్ట్రికల్ షాపును బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా ఆయనకు లబ్ధిదారు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు దేశానికే ఆదర్శమని కొనియాడారు. ఈ పథకం కింద ప్రభుత్వం అందిస్తున్న రూ.10 లక్షల పెట్టుబడిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని లబ్ధిదారులకు సూచించారు.
నియోజకవర్గంలో మొదటి విడుతగా 100 మంది దళిత కుటుంబాలను ఎంపిక చేయగా, ఇందులో పీచుపల్లిలో 14 మందికి అవకాశం కల్పించామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరో 1500 కుటుంబాలకు పథకాన్ని వర్తింపజేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంప వెంకన్న, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డి, సర్పంచులు పీచు చంద్రారెడ్డి, అటికం శారద శ్రీనివాస్, కుమ్మరి సంపత్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాడూరి వెంకట రమణారెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్ అటికం రవి గౌడ్, నాయకులు న్యాత సుధాకర్, పుల్లెల లక్ష్మణ్, గొల్లపెల్లి రవి, గూడూరి సురేశ్, జాలి తిరుపతిరెడ్డి, గుంటుక లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం
మా లాంటి పేదోళ్ల కోసం దళితబంధు పెట్టిన సీఎం కేసీఆర్ సార్‌కు జావితాంతం రుణపడి ఉంటాం. పథకం కింద అవకాశం కల్పించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు కృతజ్ఞతలు. ఈ పథకం కింద మంజూరైన రూ.10 లక్షలతో జంగపెల్లిలో శివసాయి ఎలక్ట్రికల్ షాపు పెట్టుకున్నం. మంచిగా నడుపుకొంటూ బతుకుతం.
–బోయిని ఓదమ్మ,దళితబంధు లబ్ధిదారు, పీచుపల్లి