కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 1: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానం ముస్తాబైంది. ఉత్సవాలకు రాష్ట్ర పౌరసరఫరాలు, వెనుకబడిన తరగతుల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిధిగా హాజరై, ఉదయం 9 గంటలకు పతాకావిష్కరణ చేయనున్నారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించి, సందేశం అందించనున్నారు. కాగా, వివిధ పాఠశాలల విద్యార్థులు పరేడ్ గ్రౌండ్లో సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. వేడుకలు తిలకించేందుకు తరలివచ్చే నగరవాసులు, అతిథులకు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించనున్నారు.
గంటకు పైగా కార్యక్రమం నిర్వహించే అవకాశముండగా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మైదానంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారు. కలెక్టరేట్లో ఉదయం 8.45 గంటలకు కలెక్టర్ జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. కలెక్టరేట్లో నిర్వహించే కార్యక్రమంతో పాటు పరేడ్ మైదానంలో జరిగే వేడుకల్లో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది విధిగా పాల్గొనాలని అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ కోరారు. కాగా, ఆవిర్భావోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని తెలంగాణ చౌక్, బస్టాండ్, కమాన్ కూడళ్లను విద్యుత్ లైట్లతో అలంకరించారు.