కథలాపూర్, మే 31 : కథలాపూర్ మండలం దుంపేట శివారులోని వరద కాలువ వంతెనపై కారు, టాటా ఏస్ వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఒకరు మృతిచెందారు. 20 మంది గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం కో జన్కొత్తూర్కు చెందిన గంగపుత్రులు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి గ్రామానికి చేపలు పట్టేందుకు టాటా ఏస్ వాహనంలో వెళ్తున్నారు. కథలాపూర్ మండలం కలికోట గ్రామానికి చెందిన కుటుంబసభ్యులు కొండగట్టుకు వెళ్లి కథలాపూర్ వైపు వెళ్తుండగా దుంపేట శివారులోని వరదకాలువ వంతెనపై ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇబ్రహీంపట్నం మండలం భర్తీపూర్ గ్రామానికి చెందిన దుబ్బాక రమేశ్ (38)తో పా టు మరో ఇద్దరు కాలువలో పడ్డారు. రెండు వాహనాల్లో ప్రయాణిస్తున్న 20 మంది గాయాలపాలయ్యారు. ఘటనా స్థలానికి ఎస్ఐ రజిత చేరుకొని క్షతగాత్రులను 108లలో కోరుట్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఇందులో రమేశ్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెట్పల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. గాయాలైన వారిలో కొందరిని మెట్పల్లి, నిజామాబాద్ దవాఖానలకు తరలించారు.