కార్పొరేషన్, మే 26 ;కరీంనగర్ నడిబొడ్డున ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మల్టీపర్పస్ స్కూల్ మైదానం పార్క్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మేయర్ వై సునీల్‌రావు పార్కు అభివృద్ధి విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొన్నారు. ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 70 శాతం మేరకు పనులు పూర్తి కాగా, మిగతా పనులను రెండు నెలల్లో పూర్తి చేసి ఆగస్టు 15న ప్రారంభించే దిశగా చర్యలు చేపడుతున్నారు.
నగర ప్రజలు సాయంత్రం సమయంలో ఆహ్లాదంగా గడిపేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో గతంలో అప్పటి ఎంపీ వినోద్‌కుమార్ మల్టీపర్పస్ స్కూల్ మైదానంలో సుందరమైన పార్క్‌ను నిర్మించాలని సమాలోచనలు చేశారు. రూ.9కోట్ల స్మార్ట్‌సిటీ నిధులు కేటాయించారు. ఈ మేరకు పూర్తిస్థాయిలో డీపీఆర్‌ను సిద్ధం చేసి పనులను ప్రారంభించారు. అయితే, మధ్యలో వివిధ సాంకేతిక సమస్యలు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పనుల్లో కొంత జాప్యం జరిగింది. కాగా, ఇటీవల ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టిసారించగా, పనులు ఊపందుకున్నాయి. పార్క్‌లో వాకింగ్ ట్రాక్, పౌంటెయిన్లు, పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఆట వస్తువులు, ఓపెన్ థియేటర్, యోగా సెంటర్‌తో పాటు ప్రజలు ఆహ్లాదంగా గడిపేందుకు, సంతోషంగా వేడుకలు నిర్వహించుకునేందుకు వీలుగా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే గ్రీనరీతో పాటు ఇతర పనులు పూర్తి కాగా పౌంటెయిన్లు, వాకింగ్ ట్రాక్స్, ఇతర పనులు సాగుతున్నాయి.
ఆగస్టు నాటికి పూర్తి చేస్తాం
మల్టీపర్పస్ స్కూల్ మైదానంలో చేపడుతున్న పార్క్ పనులను ఆగస్టు నాటికి పూర్తి చేసి, స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నం. పనుల్లో వేగం పెంచి, త్వరగా పూర్తి చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినం. అందుకు అనుగుణంగా పనులు కూడా సాగుతున్నయి. పనులను ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నం. ఆహ్లాదకర వాతావరణంలో ప్రజలు గడిపేందుకు వీలుగా పార్క్‌ను సిద్ధం చేస్తున్నం.
– మేయర్ వైసునీల్‌రావు