మంథని టౌన్, మే 26: అంబేద్కర్ను కించపరిచేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీన జిల్లావాసులు వ్యవహరించడం సిగ్గుచేటని, ప్రజాస్వామ్య స్ఫూర్తికే అవమానమని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పేర్కొన్నారు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు ఆలోచన చేసి పాఠశాలలు, లైబ్రరీలో అంబేదర్ చరిత్రను పెట్టాలని, ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా చాటిచెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమకు అంబేదర్ పేరు పెట్టడంతో జరిగిన విధ్వంసాన్ని నిరసిస్తూ గురువారం పెద్దపల్లి జిల్లా మంథని అంబేదర్ చౌరస్తాలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోనసీమలో జరిగిన మూర్ఖత్వపు చర్యకు నిరసనగా దీక్ష చేపట్టినట్లు చెప్పారు.
76 ఏండ్ల తర్వాత ఈ దుస్థితి నెలకొన్నందుకు ప్రజాస్వామ్యవాదులంతా తలదించుకునే పరిస్థితులు ఏర్పడడం బాధాకరమన్నారు. అంబేదర్ను ఒక వర్గానికి అంటగట్టి ఇంత అవమానకరంగా చేస్తున్న చర్యలను మేధావులు ఖండించాలన్నారు. అంబేదర్ను అవమానించిన వారికి జ్ఞానోదం కలిగేలా గ్రామ గ్రామాన ఆయన చరిత్ర చెప్పడానికి కార్యాచరణ మొదలు పెడుతున్నామని, మంథని నియోజకవర్గం నుంచే ఆరంభిస్తామని చెప్పారు. ఎవరిని పూజించాలే ఎవరిని ద్వేషించాలని ప్రజాస్వామ్య దేశంలో తెలియకపోవడం ప్రజాస్వామ్య విలువను కాపాడినట్లా ? కాలరాసినట్లా ? మేధావులే చెప్పాలని ప్రశ్నించారు.
అనంతరం మంథని ప్రధాన చౌరస్తాలోని బీఆర్ అంబేదర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇక్కడ భూపాలపల్లి జిల్లా టీఆర్ఎస్ నాయకుడు జక్కు రాకేశ్, జడ్పీటీసీ తగరం సుమలత – శంకర్లాల్, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఏఎంసీ చైర్ పర్సన్ శ్రీరాంభట్ల సంతోషిణి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఏగోళపు శంకర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ అరెపల్లి కుమార్, కౌన్సిలర్లు వీకే రవి, గర్రెపల్లి సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు తగరం శంకర్లాల్, గుండా పాపారావు, పూదరి సత్యనారాయణ గౌడ్, బత్తుల సత్యనారాయణ, అక్కపాక సంపత్, ఎంఎస్ రెడ్డి, నక్క శంకర్ ఉన్నారు.