కొత్తపల్లి, మే 18: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్ సూచించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నగరపాలక సంస్థ, జిల్లా యువజన, క్రీడాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను బుధవారం ఆయన సందర్శించారు. కోచ్‌లు, విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, వేసవి క్రీడా శిబిరాలతో చిన్నారుల్లో ఉత్సాహం పెరుగుతుందన్నారు. పిల్లలకు ఇష్టమైన క్రీడను గుర్తించి తల్లిదండ్రులు శిక్షణ ఇప్పించాలన్నారు. పిల్లలతో కలిసి ఫుట్‌బాల్, వాలీబాల్ ఆడి ఉత్సాహం నింపారు. అనంతరం ఇటీవల జిల్లా స్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడా పాఠశాల విద్యార్థులు అమిత, ఎం లావణ్య, సాయిహారతిని అభినందించారు. డీవైఎస్వో రాజవీరు, కోచ్‌లు కిష్టయ్య, గణేశ్, రవి, వలీ పాష, అంజయ్య పాల్గొన్నారు.