జమ్మికుంట రూరల్, సెప్టెంబర్ 4: సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమానికి ప్రవేశపెట్టిన పథకాలపై బీజేపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్రజలు నమ్మొద్దని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేర్కొన్నారు. మండలంలోని తనుగుల గ్రామంలో శనివారం ఆయన సీసీ రోడ్లు, మురుగు కాలువలు, అంబేద్కర్ మహిళా సంఘ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. పాపక్కపల్లి-తనుగుల ప్రధాన రహదారిపై రూ. 2 కోట్ల 80 లక్షలతో చేపట్టే హైలెవల్ వంతెనకు శంకుస్థాపన చేశారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు ఇచ్చిందని ప్రశ్నించారు. హుజూరాబాద్ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్‌కు ఎంతో ప్రేమ ఉందన్నారు. మండలానికి ఎస్డీఎఫ్ నిధులు రూ.10 కోట్లు, ఈజీఎస్ రూ. 7 కోట్లు, దళితవాడల అభివృద్ధికి రూ. 14 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాగా, రెండు గ్రామాల్లో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఎంపీపీ దొడ్డె మమత, జడ్పీటీసీ శ్రీరాం శ్యాం, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మద్దిరెడ్డి వెంకట్‌రెడి,్డ సర్పంచులు చిలుముల వసంత-రామస్వామి, కాట్మండి మహేందర్, శ్రీలత-సత్యం, వైస్ ఎంపీపీ తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ ఫోరం మండల అధ్యక్షురాలు మమత, ఎంపీటీసీలు వాసాల సిరోష-రామస్వామి, మర్రి మల్లేశం, మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, ఆర్అండ్ బీ ఎస్ఈ సాంబశివరావు, ఈఈ బాపిరెడ్డి, ఏఈ సమ్మయ్య తదితరులు ఉన్నారు.