సారంగాపూర్/జగిత్యాల, మే10: తుంగూర్‌లో ఘోరం జరిగింది. రోడ్డు సమస్యను పరిష్కరించేందుకు వెళ్లిన అధికారులపై పెట్రోల్ దాడి సంచలనం సృష్టించింది. గ్రామంలోని దారి స్థలం తనదంటూ ఇన్నాళ్లూ బండలు, చెట్లు అడ్డుగా పెట్టిన వ్యక్తే.. ఆగ్రహంతో పెట్రోల్ స్ప్రే చేసి నిప్పంటించడం జిల్లాలో కలకలం రేపింది. దాడిలో తీవ్రంగా గాయపడిన ఎంపీవో రామకృష్ణను జిల్లా ప్రధాన దవాఖానకు తరలించగా, ఘటనపై జిల్లా యంత్రాంగం భగ్గుమంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
రోడ్డు సమస్యను పరిష్కరించేందుకు గ్రామానికి వెళ్లిన అధికారులపై ఓ వ్యక్తి పెట్రోల్ దాడి చేసి నిప్పటించిన ఘటన జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్‌లో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. తుంగూర్‌లోని బస్టాండ్ సమీపంలోని బీడీ కార్మికుల కాలనీ రోడ్డు విషయంలో గత కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ స్థలం తనది అంటూ ఇదే కాలనీకి చెందిన చుక్క గంగాధర్ రోడ్డుకు అడ్డంగా బండలు, కట్టెలు పెడుతూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాడు. ఈ క్రమంలో కాలనీవాసులు పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా, మంగళవారం అధికారులు గ్రామానికి వెళ్లారు.
డీఎల్పీఓ కనకదుర్గా, తహసీల్దార్ ఆరిపొద్దిన్, ఎంపీఓ రామకృష్ణరాజు, ఎస్ఐ గౌతమ్, సర్పంచ్ గుడిసె శ్రీమతి, ప్రజాప్రతినిధులు గ్రామంలోకి వెళ్లి కాలనీవాసులతో మాట్లాడి, రోడ్డుకు అడ్డంగా వేసిన కట్టెలు, బండలు తొలగించారు. విషయం తెలిసిన చుక్క గంగాధర్ పురుగుల మందు స్ప్రే చేసే మిషన్‌లో పెట్రోల్ నింపుకుని వచ్చి అక్కడున్న అధికారులు, కాలనీ వాసులపై స్ప్రే చేస్తుండగా, ఎస్ఐ గౌతమ్ ఆపేందుకు ప్రయత్నించారు. అయినా వినకుండా గంగాధర్ లైటర్‌తో నిప్పంటించడం తో మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న ఎంపీఓ రామకృష్ణరాజుకు మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే జగిత్యాల జిల్లా ప్రధాన దవాఖానకు తరలించగా చికిత్స పొందుతున్నాడు. డీఏస్పీ ప్రకాశ్, సీఐ కృష్ణకుమార్ విషయం తెలుసుకొని వెంటనే ఎంపీఓను పరామర్శించారు. ఘటనపై ఆరా తీశారు. కాగా, గంగాధర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్ పరామర్శ..
దాడి విషయం తెలియగానే జగిత్యాల ఎమ్మె ల్యే సంజయ్ కుమార్ దవాఖానకు వెళ్లి ఎంపీఓ రామకృష్ణరాజును పరామర్శించారు. ఎస్ఐ గౌతమ్, తహసీల్దార్ ఆరిపొద్దీన్పైనా దాడి జరడగంతో ఫోన్లోనే పరామర్శించారు. ఎమ్మెల్యే సం జయ్ మాట్లాడుతూ అధికారులపై దాడిని తీవ్రం గా ఖండిస్తున్నామని, ఏమైనా ఇబ్బందులు ఉంటే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి కానీ ఇలా దాడి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అలాగే ఎంపీఓను జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత పరామర్శించారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేసే అధికారులపై దాడి చేయడం దురదృష్టకరమన్నారు. దాడికి కారకులైన వారెంతటి వారైనా సహించేది లేదని, శిక్షపడేలా చేస్తామని స్పష్టం చేశారు. ఆమె వెంట జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, బీర్పూర్ జడ్పీటీసీ పద్మ రమేశ్, ఎంపీపీ రమేశ్, జడ్పీ సీఈవో సుందర వరద రాజన్, డీపీవో హరికిషన్ ఉన్నారు.
కఠినంగా శిక్షించాల్సిందే..
కరీంనగర్ కలెక్టరేట్/ కొత్తపల్లి, మే 10: తుంగూ ర్ ఘటనను కరీంనగర్ జిల్లా ఎంపీడీవోల సంఘం నాయకులు తీవ్రంగా ఖం డించారు. దాడికి పాల్పడ్డ నిందితుడిని కఠినంగా శిక్షించాలని, అధికారులకు రక్షణ కల్పించాలని జిల్లా ఎంపీడీఓల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దివ్య దర్శన్ రావు, శ్రీనివాస్ రెడ్డి కోరారు. అలాగే మండల పంచాయతీ అధికారుల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. కఠినంగా శిక్షించాలని కోరారు.