గొల్లపల్లి, మే 10 : దళితుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శమని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గొల్లపల్లి మండల కేంద్రంలో ధర్మపురి నియోజకవర్గ స్థాయి దళిత బంధు లబ్ధిదారులకు మంగళవారం అవగాహన, ప్రొసీడింగ్ కాపీలను ఎమ్మెల్సీ ఎల్ రమణ, కలెక్టర్ రవి, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంతతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో 41వేల మంది దళితులు ఉన్నారని, ఈ ఆర్థిక సంవత్సరంలో వంద మందిని ఎంపిక చేసి వారికి అనుభవం ఉన్న రంగాల్లో వారు కోరుకున్న యూనిట్లను మంజూరు చేశామన్నారు. కొందరు లబ్ధిదారులు అవగాహన లేకుం డా యూనిట్లను పెట్టుకున్నారని, వాటిని మార్చుకునే అవకాశం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. యానిట్లను మార్చుకోవాలనుకునే వారు రెండ్రోజుల్లో ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి వివరాలు అందజేయాలన్నారు.
జగిత్యాల జిల్లాలో దళితబంధు కు 348 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని, వారికి యూనిట్లపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. జిల్లాకు మంజూరైన యూనిట్లలో 80 శాతం డబ్బులు ప్రభుత్వం విడుదల చేసిందని, జిల్లాలో దళితబంధు కోసం రూ.26 కోట్ల 83 లక్షలు ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు ప్రతి యూనిట్‌కు ప్రాథమిక అవసరాల కోసం రూ.30 వేలు విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే దివ్యాంగులను వివాహం చేసుకున్న ఏడుగురికి రూ.లక్ష చొప్పున ఇన్సెంటివ్ చెక్కులను అందించారు.
దివ్యాంగుల స్వయం ఉపాధి కోసం కిరాణ షాపుల నిర్వహణకు వారి యూనిట్‌ను బట్టి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు ఏడుగురు దివ్యాంగులకు అందించారు. దళితబంధు లబ్ధిదారులు పదేళ్ల వరకు యూనిట్‌ను నిర్వహిస్తూ ఆర్థికాభివృద్ధి సాధించాలని, పదేళ్లలోపు యూనిట్‌ను విక్రయిస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మీనారాయణ, సంక్షేమాధికారి నరేశ్, ఎంపీపీ శోభ, జడ్పీటీసీలు గోస్కుల జలంధర్, బాదినేని రాజేందర్, బత్తిని అరుణ, వైస్ ఎంపీపీ ఆవుల సత్తయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ గంగాధర్, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గంగారెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రమేశ్, ప్యాక్స్ అధ్యక్షుడు మాధవ రావు, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు అంజద్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్, పట్టణాధ్యక్షుడు జలంధర్, ప్రధాన కార్యదర్శి బాబు, తహసీల్దార్ మధు, గొల్లపల్లి ఉప సర్పంచ్ మారం రాజశేఖర్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.