చొప్పదండి,మే10: దేశంలోని ప్రాథమిక సహకార సంఘాలకు చొప్పదండి సహకార సంఘం ఆదర్శంగా నిలిచిందని, పనితీరుకు మెచ్చి మూడుసార్లు జాతీయస్థాయి అవార్డు రావడం నియోజకవర్గానికి గర్వకారణమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి పీఏసీఎస్‌ను ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి చెందిన అడిషనల్ కమిషనర్, అడిషనల్ రిజిస్టార్(బ్యాంకింగ్) అధికారి చంద్రకళతో పాటు 15 మంది సహకార సంఘం అధికారుల బృందం మంగళవారం సందర్శించగా, సంఘం చైర్మన్ వెల్మమల్లారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సుంకెరవిశంకర్, పాలకవర్గసభ్యులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు.
సంఘ కార్యకలాపాలు, బ్యాంకు లావాదేవీలు, రైతులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కంప్యూటర్ విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పాలకవర్గ సభ్యులు, సిబ్బంది కృషితోనే చొప్పదండికి ఇంతటి ఖ్యాతి దక్కిందని కొనియాడారు. సంఘ సేవలను ఇతర రాష్ర్టాల నుంచి అధికారులు సందర్శిస్తున్నారంటే చొప్పదండి సంఘం పర్యాటక సంఘంగా మారిందని అభివర్ణించారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా పథకాలు ప్రవేశపెడుతున్నారని, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. కాగా, సంఘం అభివృద్ధికి కృషిచేస్తున్న ఎమ్మెల్యేకు, పాలకవర్గ సభ్యులకు, సిబ్బందికి సంఘం చైర్మన్ వెల్మమల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
చొప్పదండి స్ఫూర్తిగా అభివృద్ధి చేస్తాం: ఉత్తరప్రదేశ్ అధికారులు
చొప్పదండి సంఘం స్ఫూర్తిగా తమ రాష్ట్రంలోని సహకార సంఘాలను అభివృద్ధి చేస్తామని ఉత్తర ప్రదేశ్ అడిషనల్ కమిషనర్, అడిషనల్ రిజిస్టార్ అధికారి చంద్రకళ పేర్కొన్నారు. వరుసగా మూడుసార్లు ఒకే సంఘానికి జాతీయస్థాయి అవార్డు రావడం అభినందనీయమని కొనియాడారు. అధ్యక్షుడు వెల్మమల్లారెడ్డి, కార్యదర్శి తిరుపతిరెడ్డి, పాలకవర్గసభ్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ సంఘాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. సందర్శించిన వారిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కోఆపరేటివ్ బ్యాంక్ ఎండీ వి.కే.మిష్రా, అసిస్టెంట్ రిజిస్టార్ సాధనసింగ్, ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, కౌన్సిలర్లు మాడూరి శ్రీనివాస్, కొత్తూరి మహేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోకరాజేశ్వర్రెడ్డి, సహకార సంఘం డైరెక్టర్లు కళ్లెం లక్ష్మారెడ్డి, ఆనందరెడ్డి, కొమురయ్య, పద్మ, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, నాయకులు నలుమాచు రామక్రిష్ణ ఉన్నారు.