జగిత్యాల రూరల్, మే 10 : రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతిపక్ష నాయకుల అసత్య ఆరోపణలను తిప్పికొట్టాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, టీఆర్ఎస్ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ సతీశ్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని విరూపాక్షి గార్డెన్స్‌లో జగిత్యాల నియోజకవర్గ స్థాయి సోషల్ మీడియా కార్యకర్తల సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని అభివర్ణించారు. టీఆర్ఎస్ పార్టీకి సోషల్ మీడియా ఓ బలం అని, ప్రజల్లో ఆదరణ ఉండే పార్టీకి సోషల్ మీడియా అదనపు బలంగా ఉంటుందన్నారు. టీఆర్ఎస్ పార్టీకి సోషల్ మీడియాలో 11లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారని, ఏ పార్టీ మనకు దరిదాపుల్లో లేదన్నారు. కొందరు, కొన్ని పార్టీలు చిచ్చు పెట్టేందుకే సోషల్ మీడియాను వాడుకుంటున్నారని, వాటిని తిప్పికొట్టాలన్నారు. సోషల్ మీడియాలో వాస్తవాలు వివరించాలని, మన అభివృద్ధిని చూపాలన్నారు.
టీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలకు వేధింపులు వస్తే పార్టీ అండగా ఉంటుందని, తెలంగాణ పెన్షన్లలో కేంద్రం వాటా గురించి బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు సబ్జెక్టుతో కొట్టాలని, 2004నుంచి 2014మధ్య విడుదల చేసిన నిధుల కంటే గత ఐదేళ్లలో రెట్టింపు నిధులతో అభివృద్ధి చేశామన్నారు. ఈ వాస్తవాలను ప్రచారం చేయాలన్నారు. అనంతరం జగిత్యాల పట్టణానికి చెందిన పెరుమాండ్ల వెంకట రమణ భార్య చంద్రకళ అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, జగిత్యాల మున్సిపల్ అధ్యక్షురాలు బోగ శ్రావణి, రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు, టీఆర్ఎస్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సోషల్ మీడియా అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, సహకార సంఘాల చైర్మన్లు, ఆర్బీఎస్ కన్వీనర్లు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.