కరీంనగర్ రాంనగర్, మే 10: వినోదం పేరిట ప్రేక్షకుల నుంచి అడ్డగోలుగా వసూలు చేస్తూ.. కనీస నిబంధనలకు తూట్లు పొడుస్తున్న థియేటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కరీం‘నగరం’లో మంగళవారం ఏకకాలంలో తొమ్మిది బృందాలతో దాడులు చేసి నిబంధనలు పాటించని ఐదు థియేటర్లను సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కరోనాతో రెండేండ్లుగా మూతపడ్డ థియేటర్లు కొద్ది నెలల క్రితమే తెరుచుకున్నాయి. ఈ క్రమంలో అడ్డగోలుగా వసూలు చేస్తూ కనీస నిబంధనలు మరువగా, కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు కన్నెర్ర చేశారు. సీపీ ఆధ్వర్యంలో నగర పోలీసులు 9 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సినిమా థియేటర్లలో తనిఖీలు చేశారు.
అయితే థియేటర్ల యజమానులు లైసెన్స్‌లు పునరుద్ధరించుకోకపోవడం, ఫైర్ సెఫ్టీ పని చేయకపోవడం, సీసీ కెమెరాలు, పరిశుభ్రత, బిల్డింగ్ పటిష్టత లాంటి ఏ ఒక్క నిబంధనను పాటించడం లేదని పోలీసుల దృష్టికి వచ్చింది. ప్రతి ఒక్కరి లైసెన్స్‌లను పరిశీలించిన సీపీ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మమత, శివ, తిరుమల, సాయికృష్ణ, తిరందాస్ థియేటర్లు ఎలాంటి నిబంధనలు పాటించకపోవడంతో సీజ్ చేస్తున్నట్లు సీపీ ప్రకటించారు. కరోనా తర్వాత జనాలు ఇప్పుడిప్పుడే వినోదం కోసం థియేటర్లకు వెళ్తున్నారని, అయితే నిర్వాహకులు నిబంధనలు పా టించడం లేదని వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. థియేటర్ల నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలను ఈ సందర్భంగా వివరించారు.
ప్రజల భద్రత కోసం చర్యలు తీసుకోవాలి
ప్రమాదాలు జరిగినప్పుడు ఎటువంటి నష్టం జరగకుండా ఉండేలాచూసుకోవాలి
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పడు వాటి పనితీరును పరిశీలించాలి
థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులను తనిఖీ చేసే యంత్రాలు ఏర్పాటు చేసుకోవాలి
ఫైర్ సెప్టీ ఏర్పాటు చేసి ఫైర్ డిపార్టుమెంట్ ఇచ్చే సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా ఉంచుకోవాలి బిల్డింగ్ పటిష్టతపై ఆర్అండ్బీ అధికారులు ఇచ్చే సర్టిఫికెట్‌ను అందుబాటులో ఉంచుకోవాలి థియేటర్‌కు లైసెన్స్ ఉండాలి