కరీంనగర్ కార్పొరేషన్, మే 10 : కరీంనగరాన్ని మరింత పరిశుభ్రంగా మార్చేందుకు బల్దియా నడుంబిగించింది. ఇప్పటికే నగరంలో ఇంటింటా చెత్త సేకరణతో పాటు ఖాళీ స్థలాల్లో చెత్త పోగవకుండా చర్యలు చేపడుతున్న యం త్రాంగం, ఎప్పటికప్పుడు సిటీని క్లీన్గా ఉంచుతున్నది. అయితే ప్రస్తుతం రోడ్లపై ఉన్న డంపర్ బిన్స్తో అనేక ఇబ్బందులు వస్తున్నాయి. తీవ్ర దుర్వాసన వస్తున్నది. ఇంకా పశువులు ఆ ప్రాంతాన్ని స్థావరంగా మార్చుకుంటున్నాయి. చెత్తను చెల్లా చెదురు చేస్తున్నాయి. వీటి వల్ల రోడ్ల వెంట వెళ్లేవారికి ఇబ్బందులు వస్తుండగా, వీటన్నింటికీ చెక్పెట్టేందుకు కొత్తగా అండర్ గ్రౌండ్ డంపర్ బిన్స్ ఏర్పాటు చేస్తున్నది.
ఇప్పటికే తొలివిడుత బస్టాండ్ వెనుక, ప్రభుత్వ దవాఖాన వెనుక, ఎస్ఆర్ఆర్ కళాశాల సమీపం, మహిళ డిగ్రీ కళాశాల వద్ద ఏర్పాటు చేశారు. కాగా మరిన్ని ప్రాంతాల్లోనూ వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెండో విడుత ఏర్పాటుకు స్మార్ట్ సిటీ కింద రూ.1.47 కోట్ల కేటాయించారు. ఈ నిధులతో నగరంలోని అన్నపూర్ణ కాంప్లెక్స్, శనివారం మార్కెట్, మార్కెట్ రిజర్వాయర్ వద్ద, తెలంగాణ చౌక్, ఆదర్శనగర్, సాయినగర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు ఇతర రద్దీగా ఉండే ప్రాంతాల్లోనూ వీటిని ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
తడి, పొడి చెత్త వేర్వురుగా
తడి, పొడి చెత్తను వేర్వురుగా వేసేందుకు వీలుగా ఆయా ప్రాంతాల్లో రెండేసి చొప్పున డంపర్ బిన్స్ను ఏర్పాటు చేస్తున్నారు. అండర్ గ్రౌండ్లో బిగించి, చెత్త వేయడానికి వీలుగా పరిశుభ్రంగా ఉంచనున్నారు. ఇంకా బిన్ నిండి న వెంటనే సిబ్బందికి ఆటోమెటిక్ మెస్సేజ్ వెళ్లేలా జీఐఎస్, సెన్సార్ను బిగిస్తున్నారు. ఈ విధంగా ఎప్పటికప్పుడు పారిశుధ్య సిబ్బందికి సమాచారం చేరి, తరలింపు ఈజీ కానున్నది. ఎక్కడ కూడా రోడ్లపై చెత్త పోగవకుండా ఆ ప్రాంతమంతా పరిశుభ్రంగా ఉండనున్నది.