కరీంనగర్, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ తరగతులు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయనపల్లి వినోద్‌కుమార్ కేంద్ర విద్యా శాఖ ఉన్నతాధికారులను కోరారు. కరీంనగర్లో ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన నేపథ్యంలో ఆయన శనివారం న్యూఢిల్లీలో వారితో సమావేశమై చర్చించారు. కరీంనగర్లో ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ పరంగా అన్ని వసతులు, ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. కరీంనగర్లో ట్రిపుల్ ఐటీని నెలకొల్పేందుకు తాను ఎంపీగా ఉన్నప్పుడు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేశానని గుర్తు చేశారు. గతంలో ప్రతి రాష్ర్టానికి ఒక ట్రిపుల్ ఐటీ ఇవ్వాలని నిర్ణయించారని, కానీ, ఈ నిబంధనలను తుంగలో తొక్కి కర్నాటకకు ఇటీవల రెండో ట్రిపుల్ ఐటీని ఇవ్వడాన్ని వినోద్‌కుమార్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో శనివారం న్యూఢిల్లీలో కేంద్ర విద్యా శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమై కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు ఆవశ్యకతను వివరించినట్లు ఆయన పేర్కొన్నారు.