వీణవంక, మే 7: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా చేపడుతున్న పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని అడిషనల్ డీఆర్డీవో సంధ్యారాణి పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. శనివారం మండలంలోని మామిడాలపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఉపాధిహామీ పనులతోపాటు చల్లూరులో నర్సరీని పరిశీలించారు. అనంతరం వీణవంకలో పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో కనీసం 200 మంది కూలీలు ఉపాధిహామీ పనులకు హాజరయ్యేలా చూడాలన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా పనిస్థలాల్లో కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేయాలని సూచించారు. ఉపాధిహామీ పనులకు కూలీలు వచ్చేలా ప్రోత్సహించాలన్నారు. ప్రతి పనినీ క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలేమైనా ఉంటే పరిష్కరించాలని చెప్పారు. వచ్చే హరితహారానికి సన్నద్ధం కావాలని, గ్రామాల వారీగా అవసరమైన మొక్కలు.. రకాలతో ప్రణాళికను రూపొందించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఎండల తీవ్రతకు నర్సరీల్లోని మొక్కలు ఎండిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో ప్రభాకర్, ఆయా పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.