తెలంగాణచౌక్,మే 7: అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా ఆర్టీసీ చిన్న పిల్లల తల్లులకు అరుదైన కానుక ఇచ్చింది. ఐదేండ్లలోపు పిల్లల తల్లులకు రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం అన్ని సర్వీసుల్లోనూ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. గతంలోనూ మహిళా దినోత్సవం సందర్భంగా 60 ఏండ్లు నిండిన వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. అలాగే, మహిళా సంఘాల సభ్యులకు తమ ఉత్పత్తులను బస్డాండ్లలో ఉచితంగా అమ్ముకునే అవకాశమిచ్చి మహిళా పక్షపాతిగా నిరూపించుకున్నది.
సద్వినియోగం చేసుకోవాలి
మాతృదినోత్సవం సందర్భంగా ఐదేండ్లలోపు ఉన్న చిన్నారుల తల్లులకు ఆర్టీసీ అరుదైన అవకాశం కల్పించింది. పల్లెవెలుగు నుంచి ఏసీ బస్సుల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. కండక్టర్లకు నిర్దిష్టమైన సూచనలు ఇచ్చాం. ఎవరైనా తెలిసోతెలియకో టికెట్ అడిగితే తీసుకోవద్దు. ఈ అవకాశాన్ని చిన్నపిల్లల తల్లులు సద్వినియోగం చేసుకోవాలి.
– జే కవిత, డీవీఎం
చిన్న పిల్లల తల్లులకు ముందే చెబుతా..
మాతృదినోత్సవం సందర్భంగా తల్లులకు ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఐదేండ్లలోపు చిన్నారులతో కలిసి బస్సెక్కిన మహిళలకు ముందే తెలియజేస్తా. ఎవరైనా టికెట్ తీసుకునేందుకు ముందుకువచ్చినా వద్దని చెబుతా. ఈ నిర్ణయంపై ప్రతిఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– రమాదేవి, కండక్టర్ డిపో-1 (కరీంనగర్)
ఆర్టీసీ నిర్ణయం అభినందనీయం
అమ్మలకు ఆర్టీసీ అరుదైన కానుక ఇవ్వడం సంతోషంగా ఉన్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మహిళల మేలు కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటున్నది. గత మహిళా దినోత్సవం సందర్భంగా 60 ఏండ్లు నిండిన వారికి ఉచిత ప్రయాణం, సమాఖ్య మహిళలకు ఉచితంగా ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం కల్పించడం అభినందనీయం. పేద మధ్యతరగతి మహిళలకు లాభం చేకూరేలా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్టీసీ సంస్థకు కృతజతలు.
– సందబోయిన గీతాంజలి, మహిళా సంఘం నాయకురాలు (కరీంనగర్)