గన్నేరువరం, మే 7 : తెలంగాణ ప్రభుత్వం యాసంగి వడ్ల సేకరణ కోసం ఊరూరా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలతో రైతులతో పాటు హమాలీలకు ఎంతో మేలు జరుగుతున్నది. ఐకేపీ, డీసీఎమ్మెస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వీటిలో ధాన్యం అమ్మకాలు జోరందుకోగా, వివిధ పనులతో కార్మికులకు ఉపాధి దొరుకుతున్నది. ప్రతి రోజూ సుమారు రూ.వెయ్యి దాకా సంపాదన ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లోని హమాలీల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.
గన్నేరువరం మండలంలో 16 గ్రామాలు ఉండగా, ఇందులో ఎనిమిది చోట్ల ఐకేపీ, మరో ఎనిమిది గ్రామాల్లో డీసీఎమ్మెస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇటీవలే ప్రజాప్రతినిధులు వాటిని ప్రారంభించగా, కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. దళారుల బెడద లేకుండా ప్రభుత్వం అందుబాటులోనే ధాన్యం అమ్ముకొనే సౌకర్యం కల్పించడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మద్దతు ధర లభించడంతో పాటు అతి తక్కువ సమయంలోనే ధాన్యం డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవుతుండడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
హమాలీల హర్షం
గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో హమాలీలూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం తూకం వేయడానికి హమాలీ సంఘాలు అధిక సంఖ్యలో ఏర్పడ్డాయి. గ్రామగ్రామాన ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వేగంగా ధాన్యం తూకం వేయడం, బస్తాలను లారీలోకి ఎక్కించే పనిలో హమాలీలు కీలకంగా మారారు. సుమారు నెలకు పైగానే ఈ కేంద్రాల వల్ల ఉపాధి పొందనున్నారు.
చేతినిండా పని ఉన్నది..
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన తర్వాత మాకు గ్రామాల్లో చేతి నిండా పని దొరుకుతున్నది. ప్రతి రోజూ రూ.500- వెయ్యి దాకా కూలి పడుతున్నది. మండలంలో 25 హమాలీ సంఘాలు ఉండగా, సుమారు 500 మంది హమాలీ పని చేసి ఉపాధిని పొందుతున్నారు. అటు రైతులకు, ఇటు హమాలీలకు మేలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటం.
-బుర్ర శ్రీనివాస్ గౌడ్, హమాలీ సంఘం మండలాధ్యక్షుడు